శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్‌ పోసిన ఉన్మాది.. ఎక్కడ?

knife
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోసిన ఓ ఉన్మాది ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. తన ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆ బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం బజారుకు వెళ్లారు. 
 
బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆ బాలికను చెరబట్టిన ఉన్మాది ఆమెను గట్టిగా పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో నొప్పి భరించలేకు బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతుకోసి పరారయ్యాడు. 
 
ఆ బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారొచ్చి రక్తపుమడుగులో ఉన్న తమ బిడ్డను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎస్పీ విజయరామారావులు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.