పెళ్లయి 10 రోజులే... అత్తారింటికి వెళ్లాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకుంది
ఆమెకి తల్లిదండ్రులు, తోబుట్టువులు అంటే ప్రాణం. వారిని విడిచి వెళ్లింది లేదు. ఐతే 10 రోజుల క్రితం పెళ్లయింది. అత్తారింటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఐతే పుట్టింటిని విడిచి వెళ్లిపోతున్నానన్న బెంగతో ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అనంతపురంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. వీరిలో పెద్ద కుమార్తె సుజన వయసు 26 ఏళ్లు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. డిసెంబరు 17న పెళ్లయింది. ఆ తర్వాత నుంచి పుట్టింట్లోనే వుంటోంది.
అత్తవారింటికి సాగనంపేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల పారాణి ఆరక ముందే తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.