1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

ఆస్తి కోసం అన్నదమ్ములు, వారి పిల్లలు గొడ్డళ్ళతో నరుక్కున్నారు... ఎక్కడ?

murder
కేవలం రెండు ఎకరాల ఆస్తి కోసం అన్నదమ్ములతో పాటు వారి పిల్లలు గొడ్డళ్ళతో నరుక్కున్నారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన మార్త బుచ్చయ్య లింగమ్మ అనే దంపతులకు వీరయ్య, సైదులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తమకున్న ఎనిమిదెకరాల్లో ఆరెకరాలను ఇద్దరు కొడుకులకు పంచిచ్చారు. ముసలితనంలో వ్యవసాయం చేసే ఓపిక లేకపోవడంతో బుచ్చయ్య తన వద్ద ఉన్న రెండెకరాలనూ సమానంగా పంచుకోవాలని కుమారులకు చెప్పాడు. 
 
అయితే, పెద్ద కుమారుడు వీరయ్య మాత్రం అదును దాటుతోందనే కంగారుతో తన భార్య, కుమారుడు ప్రభాస్‌తో కలిసి పొలం దుక్కి దున్నేందుకు రెండు ఎకరాల్లో నాగలి పట్టాడు. ఇది తెలిసి అతడి సోదరుడు సైదులు కోపంతో రగిలిపోయాడు. తన కుమారుడు శేఖర్‌కు ఓ గొడ్డలి ఇచ్చి, తానో గొడ్డలి తీసుకుని వీరయ్య దగ్గరకు చేరుకున్నారు. భూమి పంపకాలు జరగనిదే ఎలా దున్నుతావంటూ అన్నపై సైదులు మండిపడ్డాడు. 
 
ఇంతలో శేఖర్ తన చేతిలో ఉన్న గొడ్డలితో ప్రభాస్ తలమీద కొట్టాడు. గాయంతో నెత్తురోడుతూ కొడుకు కిందపడిపోవడాన్ని చూసి వీరయ్యలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముళ్లకంప కొట్టేందుకు తెచ్చుకున్న గొడ్డలి చేతుల్లోకి తీసుకొని శేఖర్ వెన్నుభాగంలో ఓ వేటు వేశాడు. కొడుకు శేఖర్ నెత్తురోడుతూ కింద పడిపోవడంతో సైదులు ఆగ్రహంతో ఊగిపోతూ వీరయ్య భుజంపై నరికాడు. 
 
ప్రతిగా సైదులు తలపై వీరయ్య దాడి చేయబోగా అతడు చెయ్యి అడ్డం పెట్టాడు. గొడ్డలి పదును ధాటికి సైదులు అర చేయి భాగం తెగి కిందపడిపోయింది. ఈ దాడిలో అన్నదమ్ములు, వారి కుమారులు.. నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి శరీరాలు నెత్తుటితో తడిశాయి! హాహాకారాలు మిన్నం టాయి. అక్కడే ఉన్న వీరయ్య భార్య బిగ్గరగా రోదించింది.
 
పంచివ్వని భూమిని అన్న దున్నుతున్నాడని తెలిసి తమ్ముడు పంచాయితీ పెడితే పోయేది. పోనీ దాడికొచ్చిన తమ్ముడిని అన్న శాంతింపచేసి, అక్కడి నుంచి వెళ్లిపోయినా సరిపోయేది. కానీ అలాంటి పని చేయకుండా సొంత అన్నదమ్ములు, వారి పిల్లలు ఒకరిపై ఒకరు గొడ్డళ్ళతో నరుక్కుని, తీవ్రంగా గాయపడి ఇపుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.