సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (16:28 IST)

హైదరాబాదులో 800 మంది టెక్కీలకు టోపీ, తెల్లారేసరికి మెయిల్ బ్లాక్, బోర్డ్ పీకేసి జంప్

Fraud
హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలకు కొదవే వుండదు. చిత్రవిచిత్రమైన పేర్లతో కంపెనీలు ఇక్కడ రన్ అవుతుంటాయి. ఆ కంపెనీ పోర్ట్ ఫోలియో కూడా చూడకుండా పలువురు నిరుద్యోగులు నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి మోసం హైదరాబాదులో జరిగింది. సుమారు 800 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇస్తున్నట్లు నటించిన సదరు కంపెనీ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షల చొప్పున తీసుకుని బోర్డ్ తిప్పేసింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే.... హైదరాబాదులోని మాదాపూర్ లోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇస్తామని చెప్పడమే కాకుండా డిపాజిట్ ఫండ్ అంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షలు వసూలు చేసింది. ఇలా సుమారు 20 కోట్ల రూపాయల వరకూ టోపీ పెట్టేసి, 2 నెలలు జీతాలు ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చినట్లు నాటకాలు ఆడారు. ఇదిలావుండగా 15 రోజుల క్రితం సదరు కంపెనీ తన వెబ్ సైట్ తో పాటు మెయిల్స్ బ్లాక్ చేసేసింది. ఆ తర్వాత ఆఫీసు వద్దకు వస్తే కంపెనీ బోర్డ్ కనిపించలేదు. దీనితో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. కేసు పెట్టి వారం రోజులయినా పోలీసులు స్పందించడంలేదని వారు పోలీసు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు.

 
ఇదిలావుంటే బీటెక్ పూర్తి చేసేవారి సంఖ్య ఏటికేడాది లక్షలకు లక్షలు పెరిగిపోవడంతో ఆ శాఖకు సంబంధించి ఉద్యోగాలు రావడంలేదు. దీనితో చాలామంది ఇతర ఉద్యోగాల కోసం సర్టిఫికెట్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా బీటెక్ నిరుద్యోగులు పెరిగిపోవడం... మోసం చేసేవారికి అవకాశంగా మారుతోందని నిపుణులు చెపుతున్నారు.