శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 19 అక్టోబరు 2021 (16:15 IST)

ఫేస్ బుక్ ఫ్రెండ్ మాయగాడిని నమ్మి సమర్పించుకున్న యువతి, ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్

నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లో సమయాన్ని గడిపేస్తుంటాం. ఏ పని చేయకున్నా ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ మనకు ఎంత మంచిని చేస్తుందో అంతకు రెండింతలు చెడును కూడా చేస్తుందన్నది నిత్యం పెద్దలు చెబుతున్న మాట.

 
కానీ వాళ్ళు చెప్పి మాటలను కొంతమంది ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఫోన్ లోనే స్నేహితులతో కలిసి కాల్స్, వీడియో కాల్స్, గేమ్స్, మెసేజెస్ వంటివి చేస్తూ ఫోన్ ద్వారా మరికొందరిని కొత్త వారిగా స్నేహం చేస్తూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అదే స్నేహం చెడు చేస్తే మాత్రం స్నేహం చేసిన వారితో పాటు ఇంటిల్లిపాది ఇబ్బందులకు గురి అవుతారు.

 
ఫేస్ బుక్‌లో పరిచయం అయిన అపరిచితులను నమ్మి మోసపోకండి అని నిత్యం పోలీసులు వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. కానీ అంతా తెలిసిన వారే బాగా చదువుకున్న వారే అనామకులను నమ్మి నట్టేట మునుగుతుంటారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 
ఫేస్ బుక్ ఫ్రెండ్‌ను నమ్మి ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలకు పైగా నగదు, నగలను సమర్పించుకుంది ఓ యువతి. తిరుపతి నగరంలోని టిటిడికి చెందిన ఒక ఇంజనీర్ కుమార్తెకు అనంతపురంకు చెందిన ఒక యువకుడు గత కొద్దిరోజుల క్రితం నుంచి ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు.

 
యువకుడు ఇష్టానుసారం మెసేజ్‌లు చేస్తుంటే ఆమె కూడా మెసేజ్‌లు చేయడం ప్రారంభించింది. ఇలా ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది. ముఖాలు చూసుకోకపోయినా సందేశాలతో ఇద్దరూ దగ్గరయ్యారు. తాను బాగా డబ్బున్న వ్యక్తి అని యువతి దగ్గర బాగా బిల్డప్ ఇచ్చాడు యువకుడు. 

 
ఏం కావాలన్నా చిటికెలో జరిగిపోతుందని నమ్మించాడు. ఆ మాయగాడి వలలో పడింది యువతి. తనకు కాస్త డబ్బులు అవసరమని.. వెంటనే సర్దుతానని 9 లక్షల 30 వేల రూపాయల నగదును మూడుసార్లు తన అకౌంట్లో వేయించుకున్నాడు. అంతేకాదు 200 గ్రాముల బంగారాన్ని కూడా తీసుకున్నాడు. 

 
అంతా తీసుకున్న తరువాత సందేశాలు కొట్టడం తగ్గించాడు. ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.