1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (09:35 IST)

పట్టపగలు నడి రోడ్డుపై మహిళా ఉపాధ్యాయురాలు దారుణ హత్య.. ఎక్కడ?

ruxana
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో పట్టపగలు ఓ దారుణం జరిగింది. గురువారం సాయంత్రం ఓ మహిళా టీచర్‌ను కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ వారు రక్షణ కల్పించలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం నడి రోడ్డుపై పోయింది. ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వేంపల్లె విద్యుత్తు ఉపకేంద్రంలో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మదనపల్లె పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన కదీర్ అహ్మద్‌కు మదనపల్లెలోని బీకేపల్లెకు చెందిన రుక్సానా (32) అనే మహిళతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె మదనపల్లెలోని శ్రీజ్ఞానాంబిక జూనియర్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 
 
వివాహమైన మూడేళ్ల అనంతరం కూడా ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఆమె అనుమతితోనే కదీర్ అహ్మద్ మదనపల్లె పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన ఆయేషాను రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో సుమారు 18 నెలల కిందట మొదటి భార్య రుక్సానాకు ఆడపిల్ల పుట్టింది.
 
దీంతో అప్పటి నుంచి కదీర్ అహ్మద్ ఆమె వద్దనే ఉంటున్నారు. ఈ విషయమై అహ్మద్‌కు ఆయన రెండో భార్య అయేషాకు మధ్య విభేదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రుక్సానా వల్లనే తన భర్త తన వద్దకు రావడం లేదని, మొదటి భార్య విషయం చెప్పకుండా తనను వివాహం చేసుకున్నాడని రుక్సానా ఇంటికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయేషా గొడవ పెట్టుకుంది. 
 
మొదటి భార్య ఉండగా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె భర్త, రుక్సానాతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు అయేషా ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలావుంటే, గత రెండు నెలలుగా ఆయేషా సోదరులు, కుటుంబ సభ్యులు రుక్సానా పని చేస్తున్న కళాశాలకు వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించారు. 
 
ఇది తెలిసిన రుక్సానా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం తాను పనిచేస్తున్న కళాశాల నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రశాంత్ నగర్ సమీపంలోని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెకు అడ్డుగా ఉండి కారం జల్లి ఆమె గొంతులో పొడిచారు.
 
ఆ సమయంలో అటుగా వస్తున్న విద్యార్థులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. రుక్సానా గొంతులో పొడవడంతో ఆమె నడిరోడ్డుపైనే కన్నుమూసింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రుక్సానా తండ్రి మహమ్మద్ ఆలీ, సోదరి మస్తానీ సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ హత్యకు గురైందని ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.