శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (21:05 IST)

4 తులాల బంగారు నగల కోసం మహిళను చంపి .. శవాన్ని డ్రమ్ములో కుక్కేశారు...

murder
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన కిరాతకులు శవాన్ని ఓ డ్రమ్ములో కుక్కేశారు. ఈ దారుణం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన నర్సవ్వ అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తూ సిమెంట్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తూ వస్తుంది. ఈ క్రమంలో శనివారం నాడు కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు నర్సవ్వ వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. దీనిపై భర్త కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా, స్థానికంగా ఉండే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నర్సవ్వను ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. నర్సవ్వ వద్ద ఉండే బంగారు నగల కోసం సిమెంట్ పనులు చేయించే మేస్త్రీతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ హత్య చేయించినట్టు తేలింది. 
 
హత్య చేసిన తర్వాత 4 తులాల బంగారం, 10 తులాల వెండిని దోచుకుని, శవాన్ని డ్రమ్ములో కుక్కి.. దాన్ని గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి చెరువులో పడేశారు. వారు కదలికలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.