శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (13:08 IST)

ఆంధ్రలో ఆయన మొదటి ఖైదీ... 'Editor' అంటే తెలుగులో... గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

నిష్కళంక ప్రజా సేవకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, గ్రంథాలయోద్యమ నాయకునిగా, వయోజన విద్యా పితామహునిగా, ఆంధ్రోద్యమ నాయకునిగా, రచయితగా, ఆంధ్రదేశానికి – తెలుగు ప్రజానికానికి ఎనలేని సేవ చేసిన దీక్షపరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. హరిసర్వోత్తమరావు 1883 సెప

నిష్కళంక ప్రజా సేవకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, గ్రంథాలయోద్యమ నాయకునిగా, వయోజన విద్యా పితామహునిగా, ఆంధ్రోద్యమ నాయకునిగా, రచయితగా, ఆంధ్రదేశానికి – తెలుగు ప్రజానికానికి ఎనలేని సేవ చేసిన దీక్షపరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబరు 14వ తేదీన కర్నూలులో జన్మించారు. చదువుకునే రోజుల్ల బిపిన్ చంద్రపాల్ ప్రభావానికిలోనై వందేమాతర ఉద్యమంలో పాల్గొని కళాశాల నుండి బహిష్కరించబడ్డారు. 
 
చంద్రపాల్ వెంట ఆంధ్రదేశమంతటా తిరిగి వందేమాతర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. 1908లో తిరునల్వేలి కాల్పులను గూర్చి ఆంగ్లేయులను తీవ్రంగా విమర్శిస్తూ ‘స్వరాజ్య’ పత్రికలో రాసినందుకుగాను బ్రిటీషు ప్రభుత్వం 3 సంవత్సరాలు కఠినకారగార శిక్షను విధించింది. అతి దుర్భరమైన జైలు జీవితాన్ని 3 సంవత్సరాలు అతి సహనంతో ఆయన గడిపారు. సర్వోత్తమరావు ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ రాజకీయ ఖైదీ అయ్యారు. అందుకే ఆంధ్ర రాజకీయాలకు ఆది పురుషునిగా ఆయనను కీర్తిస్తారు.
 
1904లో ఆంధ్రలో ఏర్పడిన హోమ్ రూల్ లీగ్ శాఖకు సర్వోత్తమరావు కార్యదర్శిగా రాష్ట్రమంతటా పర్యటించారు. స్వదేశీ ఉద్యమవాదిగా బందరులో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనలోను, పాలన నిర్వహణలోను ప్రధాన పాత్రను పోషించారు. సహాయ నిరాకరణోద్యమంలో ఆయన దక్షిణ భారత సత్యాగ్రాహి సంఘ సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు. 1926లో జాతీయ కాంగ్రెస్ తరుపున నంద్యాల నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 
 
శాసనసభ్యునిగా నియోజకవర్గానికి, ఆంధ్రవిశ్వవిద్యాలయ అభివృద్ధికి అపార సేవ చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు పెక్కు రాయలసీమ నాయకులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో సర్వోత్తమరావు వారి సంకుచిత ధోరణిని విమర్శించి ఆంధ్రోద్యమానికి నూతన జీవము పోశారు. శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించడంలో ప్రధాన పాత్రను పోషించారు. సర్వోత్తమరావుకు శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎనలేని అభిమానం. కనుకనే 1928 వరకు దత్త మండలములుగా పిలువబడుతున్న జిల్లాలను కలిపి రాయలసీమ అని నామకరణం చేశారు.
 
గ్రంథాలయోద్యమ నిర్వాహకునిగా ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను స్థాపించడంలోను, గ్రంథాలయాధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించడంలోను, గ్రంథాలయ పత్రికలకు సంపాదకునిగాను విశేష సేవలను అందించారు. అంతేకాదు... ఆంగ్ల పదం Editor అంటే తెలుగులో సంపాదకుడు అని నామకరణం చేసింది ఆయనే. 
 
ప్రజలకు చదువు చాలా అవసరమని బలంగా నమ్మిన హరిసర్వోత్తమరావు ఆంధ్రదేశంలో పెక్కు వయోజన విద్యా కేంద్రాలను నెలకొల్పారు. 1934లో రైతు సంఘాన్ని స్థాపించి రైతుల స్థితిగతులు మెరుగుపర్చడానికి నిర్విరామ కృషి చేశారు. అస్పృశ్యతను రూపుమాపడానికి తన ఇంట్లోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. స్త్రీల కొరకు ‘సౌందర్యవల్లీ’ అను తెలుగు మాసపత్రికను నడిపారు. ఇట్లు జీవితాతం నీతివర్తనుడై ప్రజాసేవలో గడిపి, యావదాస్తి కోల్పోయి దారిద్ర్యంతో 1960 ఫిబ్రవరి 29న పరమపదించారు.
 
ప్రముఖవక్తగా, రచయితగా, పాత్రికేయునిగా, జాతీయవాదిగా, విజ్ఞాన చంద్రిక ప్రథమ సేవకునిగా, ఆంధ్రోద్యమ అతిరథునిగా, ఆంధ్ర గ్రథాలయోద్యమ మొదట్టి పెద్దగా, వయోజన విద్యా గురువులలో ప్రప్రథమునిగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకింత చేసిన మహాత్యాగి, మహా పురుషుడు, ఆంధ్రుల పాలిట దైవం – గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగు ప్రజలకు చిరస్మరణీయులు.