ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (16:27 IST)

సీఎం జగన్ మాట తప్పారా..? మడమ తిప్పారా? అమ్మఒడిపై ఏంటీ మతలబు?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపైన విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. అందరికీ వర్తింపజేస్తే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడిపోతాయని, అందుకే ప్రైవేట్‌ పాఠశాల్లో చదివే విద్యార్థులకు దీన్ని అమలు చేయవొద్దని అంటున్నారు.
 
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకే అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని, ప్రైవేట్‌ పాఠశాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో మాట్లాడి ఈ ప్రకటన చేశారో లేక తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారో తెలియదుగానీ ఆర్థిక మంత్రి ప్రకటన…కొన్ని రోజుల క్రితం సిఎం చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఉంది. 
 
ఎక్కడ చదువుతున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి విద్యార్థికీ అమ్మఒడి కింద ఏడాదికి రూ.15,000 అందజేస్తామని ప్రకటించారు. ఇంతలోనే బుగ్గన అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలు మూతపడతాయన్న పేరుతో అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు వర్తింపజేయవొద్దని చెప్పడంలో ఔచిత్యం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎప్పుడో గాడితప్పింది. ప్రభుత్వ పాఠశాలలపైన జనం విశ్వాసం కోల్పోయారు. 
 
ఆ మాటకొస్తే… ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లే తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించడం లేదు. దీనికి కారణం… తాము పని చేస్తున్న పాఠశాలపై తమకే విశ్వాసం లేకపోవడమే. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించకపోవడాన్ని తప్పుబట్టలేం. కూలి పనులు చేసుకునే నిరుపేదలు సైతం…. కష్టపడి కూడబెడ్టిన డబ్బులతో తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు.
 
ఈ పరిస్థితుల్లో అమ్మఒడి పథకం అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే… ప్రైవేట్‌ పాఠశాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకే ఉంది. ప్రభుత్వం ఏడాదికి రూ.15,000 ఇస్తే… ఇంకో ఐదువేలో పదివేలో జతచేసి సునాయాసంగా, తాము కోరిన పాఠశాలలో చదివించుకోగలుగుతారు. అమ్మఒడి పథకాన్ని జగన్‌ ప్రకటించగానే… పేద, మధ్య తరగతి ప్రజల్లో కొండంత భరోసా లభించింది. 
 
ఇక తమ పిల్లల చదువుకు భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నారు. ఇప్పుడు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివితే అమ్మ ఒడి వర్తించదని అంటే వీరంతా నిరాశలో కూరుకుపోతారు. ఇప్పటికిప్పుడు అమ్మఒడి పథకం కోసం తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో మాన్పించి…. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే పరిస్థితి ఉండదు.
 
అమ్మఒడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అనే షరతు పెడితే… వైసిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లు కూడా అవుతుంది. ఏనాడూ అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అనే మాటను జగన్‌ చెప్పలేదు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా చెప్పలేదు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు, ఆర్థిక మంత్రి చెబుతున్నట్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అనే షరతు విధిస్తే… ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీ అమలు తీరుగా మారుతుంది. రైతుల రుణాలను మొత్తం రద్దు చేస్తామని చెప్పి…. ఆచరణలో సవాలక్ష ఆంక్షలు, షరతులు విధించి… ఆ పథకాన్ని ఎలా కుదించారో చూశాం. అమ్మఒడి కూడా అలాంటి పరిస్థితినే మూటగట్టుకుంటుంది.
 
అయినా… వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టినపుడు, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినపుడు ఇటువంటి విమర్శలే వచ్చాయి. ఈ పథకాల వల్ల ప్రైవేట్‌ కాలేజీలు, ఆస్పత్రులు లాభపడతాయని వాదించినవారున్నారు. ఇది అర్ధ సత్యమే తప్ప పూర్తి వాస్తవం కాదు. ఈ పథకాల వల్ల ప్రైవేట్‌ ఆస్పత్రులు, కాలేజీలు లాభపడిన మాట వాస్తవమేగానీ…. లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలిగారు. 
 
లక్షల మంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయి. అందుకే ప్రభుత్వాలు మారినా… ఈ పథకాలను ఎత్తేసే సాహసం చేయలేకపోయాయి. ఇప్పుడు జగన్‌ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం కూడా…. ప్రభుత్వాలు మారినా ఎత్తేయలేని పథకమే అవుతుందనడంలో సందేహం లేదు.
 
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనడంలో తప్పులేదు. ఆ పేరుతో…. తక్షణంగా పేద ప్రజలకు అందాల్సిన సాయాన్ని అడ్డుకోవడం తగని పని. అమ్మఒడిని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలని వాదిస్తున్నవారు… ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ పేదల పిల్లలు చదువుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని…. ప్రభుత్వ, ప్రైవేట్‌ తేడా లేకుండా పేద పిల్లలందరికీ అమ్మ ఒడి అమలు చేయాల్సిన అవసరం ఉంది.