శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 22 సెప్టెంబరు 2018 (16:25 IST)

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

తిరుపతిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ క్రిష్ణమూర్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను కలవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి

తిరుపతిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ క్రిష్ణమూర్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను కలవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి తిరుపతి అభ్యర్థిగా చదలవాడ క్రిష్ణమూర్తి రంగంలోకి దిగడం దాదాపు ఖాయమైంది. 
 
చదలవాడ క్రిష్ణమూర్తి. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. నెల్లూరు జిల్లాలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు చదలవాడ. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చదలవాడ క్రిష్ణమూర్తి నాయుడుపేట మండలాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తరువాత తిరుపతికి వచ్చేసిన చదలవాడక్రిష్ణమూర్తి వ్యాపారంలో బిజీగా మారిపోయారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు.
 
చివరకు శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చదలవాడ క్రిష్ణమూర్తికి కల్పించింది. అయితే ఆ ఎన్నికల్లో బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు చదలవాడ క్రిష్ణమూర్తి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉన్న పదవులను ఇవ్వాలని చదలవాడ క్రిష్ణమూర్తి కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో 1994 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
అప్పటి నుంచి టిడిపిలో కొనసాగుతూ వచ్చిన చదలవాడక్రిష్ణమూర్తి 1999 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2003 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అలిపిరి వద్ద జరిగిన బాంబుదాడిలో చంద్రబాబు నాయుడుతో పాటు చదలవాడ క్రిష్ణమూర్తి కూడా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సఖ్యతగా ఉంటూ వచ్చిన చదలవాడ క్రిష్ణమూర్తి 2004 సంవత్సరంలో టిడిపి తరపున ఎమ్మెల్యే సీటు తనకే అన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికల సమయంలో తన బామర్థి ఎన్వీప్రసాద్‌ను వెంటపెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్ళారు చదలవాడక్రిష్ణమూర్తి. 
 
అయితే అంతకు ముందే ఎన్వీ ప్రసాద్ పార్టీ అధినేత చంద్రబాబుతో తనకు సీటివ్వాలని రెకమెండేషన్ చేయించుకున్నాడు. దీంతో ఎన్వీప్రసాద్‌కు చంద్రబాబు బి.ఫారం ఇచ్చేశారు. బావ చదలవాడ క్రిష్ణమూర్తికి తెలియకుండానే బావమరిది ఎన్వీప్రసాద్ బీ-ఫారం తీసుకుని తిరుపతికి వచ్చేశారు. దీంతో బావ-బావమరిదిలకు మధ్య రచ్చ మొదలై కుటుంబం కాస్త రెండుగా విడిపోయింది. ఆ తరువాత ఇప్పటివరకు కలవనేలేదు. వీరి మధ్య తగాదాలు ఎలా ఉన్నా చదలవాడ క్రిష్ణమూర్తి మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 
 
2014 సంవత్సరంలో తిరుపతి ఎమ్మెల్యే సీటు తనకే అన్న ధీమాలో ఉన్న చదలవాడ క్రిష్ణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న వెంకటరమణ టిడిపిలోకి జంప్ అవ్వడమే కాకుండా టిడిపి అధిష్టానంతో సంప్రదింపులు జరిపి సీటును కన్ఫామ్ చేసుకున్నారు. దీంతో చదలవాడ క్రిష్ణమూర్తికి అధినేత చంద్రబాబు నాయుడుపై కోపమొచ్చింది. పార్టీతో పాటు అధినేతపై అలకపాన్పు ఎక్కారు చదలవాడ క్రిష్ణమూర్తి. పార్టీలో సీనియర్‌గా ఉన్న చదలవాడను స్వయంగా చంద్రబాబు బుజ్జగించారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే టిటిడి ఛైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో వెంకటరమణకు పూర్తిస్థాయిలో చదలవాడ క్రిష్ణమూర్తి సహకరించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
వెంకట రమణను ఓడించడానికి చదలవాడ క్రిష్ణమూర్తి ప్రయత్నించారన్న విమర్శలు వినిపించాయి. ఇదంతా అధినేత దృష్టికి వెళ్ళింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ చాలా ఆలస్యంగా టిటిడి ఛైర్మన్ పదవిని 2015 సంవత్సరంలో చదలవాడ క్రిష్ణమూర్తికి ఇచ్చారు. రెండు సంవత్సరాల పాటు చదలవాడ టిటిడి ఛైర్మన్‌గా కొనసాగారు. టిటిడి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పార్టీలోని నేతలకే శ్రీవారి సేవా టిక్కెట్లను ఇవ్వలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు చదలవాడ. టిటిడి ఛైర్మన్ పదవీ కాలం ముగిసింది. పార్టీలో ఎలాంటి పదవులు లేవు. అధినేత చంద్రబాబును కలిసిన చదలవాడ క్రిష్ణమూర్తి రాజ్యసభ కావాలని అడిగారు. అయితే ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాత్రమే అధినేత ఒప్పుకున్నారు. దీంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు చదలవాడక్రిష్ణమూర్తి. 
 
ఎన్నికలు సమీపిస్తుండడంతో చదలవాడక్రిష్ణమూర్తి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను కలిశారాయన. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాపు సామాజిక వర్గం కావడంతో పాటు తిరుపతిలో ఎమ్మెల్యే గెలుపు కూడా కాపు సామాజిక వర్గం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి చదలవాడ క్రిష్ణమూర్తి లాంటి వ్యక్తిని జనసేనలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్థమైపోయారు. తిరుపతి ఒక్కటే కాకుండా చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీని చదలవాడక్రిష్ణమూర్తి పటిష్టం చేయగలరన్న సంకేతాలను ఆ పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్‌. 
 
చదలవాడ క్రిష్ణమూర్తి పవన్ కళ్యాణ్‌‌ను కలవడంతో ఒక్కసారిగా తిరుపతి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీనియర్ పార్టీ నేతలుగా ఉన్న కొంతమంది పార్టీలు మారుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన పార్టీలో చదలవాడ చేరికతో ఆ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంలో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.