బుధవారం, 7 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (13:39 IST)

బాబు ప్లాన్.. కమ్మ-కాపు బంధానికి బాసటగా తానా: టార్గెట్ జగన్మోహన్‌ ‘రెడ్డి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అమెరికాకు మారాయి. అమెరికాలోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలలో అత్యంత శక్తివంతమైన తానా మహాసభలు ప్రస్తుతం అట్టహాసంగా జరుగుతున్నాయి.
 
ఈసారి వేడుకలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత రాంమాధవ్, పలువురు టీడీపీ నేతలు హాజరవ్వడంతో అది తానాసభలు రాజకీయ వేదికగా మారాయి.
 
ఇక వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కేసులు, నోటీసులు, కూల్చివేతలు, ఎంక్వైరీలతో టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలపై గురి పెట్టినట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోంది.
 
ఈ పరిస్ధితి టీడీపీ అధినాయకత్వానికి, ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో పాత మిత్రుడు పవన్ కల్యాణ్‌ను.. చంద్రబాబు చేరదీసే పనిలో పడ్డారు. ఇందుకు తానా మహాసభలే వేదికగా ఆయన గుర్తించారు.
 
తానా అంటే తెలుగుదేశం పార్టీ సంస్థగా ఇటీవలి కాలంలో ముద్రపడిపోయింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తుల చేతుల్లోనే తానా ఇమిడిపోయిందనే వాదనలు వున్నాయి.
 
2014 తర్వాత ఆంధ్రలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తానా.. టీడీపీకి తందానా కొట్టడం ప్రారంభమైందని పలువురి వాదన. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. తానా...తెలుగుదేశానికి బాసటగానే ఉంటుందని పలు సందర్భాల్లో అర్థమైంది.
 
ఇకపోతే తాజాగా పవన్‌ సహకారం పొందడానికి వీలుగా టీడీపీ నేతలను చంద్రబాబు తానా సభలకు పంపారు. మరోవైపు కమ్మ సామాజికవర్గం చేతుల్లోనే తానా వుందన్న అపవాదును తొలగించుకోవడానికి.. ఏపీలో మరో బలమైన సామాజికవర్గమైన కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా.. అదే వర్గానికి చెందిన పవన్ కల్యాణ్‌కు ఈసారి ఆహ్వానం అందింది.
 
ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేల బలంతో దూకుడు మీదున్న జగన్‌ని ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాకపోవడంతో..పవన్ సహకారం ఉంటే జగన్‌ను ఇరుకునపెట్టవచ్చని బాబు భావించారు. కమ్మ, కాపు వర్గాల బలంతో రెడ్డి వర్గాన్ని ఢీకొట్టాలని టీడీపీ అధినేత మాస్టర్ ప్లాన్ వేశారు.
 
అందుకు అనుగుణంగానే బాబు చెప్పిన విషయాలను టీడీపీ నేతలు, తానాలోని పలువురు తెలుగుదేశం సానుభూతిపరులు పవన్ చెవిన వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జనసేనాని కాస్త మెత్తబడినట్లుగానే కనిపిస్తోంది.
 
ఆయన ప్రసంగంలో జగన్‌ను డైరెక్ట్‌గా కార్నర్ చేయగా... చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో కమ్మ, కాపులు ఏకమై రెడ్లపై పోరాటం సాగించే సూచనలు కనిపిస్తున్నాయి.