శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (11:18 IST)

కలిసుంటే ఖతం చేస్తున్న కరోనా.. ఏపీలో రాజకీయం కంపు కొడుతోంది!

కరోనా... క'రోనా'... రోనా అంటూ ఏడిపించుకు తింటున్న కరోనా ప్రజలను పట్టి పీడిస్తుంటే వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా అనాలోచితంగా పుట్టుకొస్తున్న కరోనా రాజకీయం కంపు కొడుతోంది. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన సమయం ఇది. అయితే ఇవన్నీ మర్చిపోయి అధికార పక్షంపై విపక్షం విపక్షాలపై అధికారపక్షం ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టడం విడ్డూరంగా ఉంది. 
 
కరోనా మరణాలు సగం భయంతో జరిగేవే. మనుషుల్లో పెరుగుతున్న భయమే మహమ్మారి కరోనా మరింత రెచ్చిపోయేలా చేస్తోంది. మరింత ఉధృతంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్-440కే కరోనా వేరియంట్ పుట్టిందో చచ్చిందోగాని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వర్సెస్ వైసిపి కరోనా రాజకీయం మాత్రం రాష్ట్రాన్ని హీటెక్కిస్తోంది. కర్నూల్‌లో కరోనా కొత్త వేరియంట్ పుట్టిందనీ అది మరింత ప్రమాదకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును బదనాం చేయడానికో, తెలుగుదేశం వారు చెబుతున్నట్లు అప్రమత్తం చేయడానికో ఏదైతేనేం ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు కరోనా కన్నా శరవేగంగా వేడెక్కుతున్నాయి.
 
చంద్రబాబుపై ఒకవైపు కర్నూల్‌లో కేసు నమోదై, నోటీసులు జారీ చేయటం దాకా వస్తే, ఇటు మంత్రులు, తెలుగుదేశం నేతల విమర్శలు ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కరోనాను మించిపోతోంది. ప్రస్తుతం కరోనా కన్నా నారావారిపల్లెలో దశాబ్దాల క్రితం పుట్టిన నారా కరోనా రాష్ట్రానికి మరింత ప్రమాదకరమని, మంత్రులు విమర్శించే స్థాయికి చేరింది. 
 
ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షం పాత్ర కూడా ఎంతో ముఖ్యం. ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇవ్వాలి. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి, అవసరమైతే ప్రభుత్వంతో కలసి కరోనాపై సాగుతున్న పోరాటంలో ముందడుగు వేయాలి. ప్రతిపక్షం అంటే అధికారపక్షాన్ని విమర్శించాలనే నైజం మారాలి. అటు ప్రభుత్వ పెద్దలు కూడా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సంయమనం పాటించాలి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మీడియా కూడా కరోనా రాజకీయాన్ని రచ్చ రచ్చ చేయడానికీ సిధ్ధమయిపోతోంది. అసలే ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక మీడియాలుగా ఇప్పటికే రెండుగా చీలిన మీడియా ఎవరికి నచ్చిన రీతిలో వారు వార్తలు వండి వారుస్తూనే వున్నారు.
 
ఇదంతా కేవలం ఏపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేశం మొత్తానికి, అదే ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న సమస్య. అందుకే అనవసర రాజకీయాలకన్నా కలిసికట్టుగా కరోనాపై పోరు సాగించాలి.
 కలిసి వుంటే కలదు సుఖం అన్న సామెతను కరోనా ఖతం చేసేసింది. కలిసుంటే కాటేస్తానంటూ ప్రజలందరినీ దూరం దూరంగా వుంచింది. కనీసం కాటికి పంపే సమయంలోనైనా కలిసి నడిచే భాగ్యానికీ అందరూ దూరమయ్యారు. 
 
అందుకే రాజకీయ పార్టీలయినా కనీసం ఈ విషయంలోనైనా ప్రజలను విడగొట్టకుండా సమిష్టిగా మహమ్మారిపై పోరు సాగించాల్సిన అవసరం ఎంతైనా వుంది. మొన్నటికిమొన్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ట్వీట్ చేస్తే అలాంటి వైఖరి సరికాదని అందరం కరోనాపై పోరులో ప్రధాని మోడీకి అండగా నిలవాలంటూ రీట్వీట్ చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచి కొత్త వొరవడికి నాంది పలికారు. అయితే అదికూడా రాజకీయమై కూచుంది. మోదీకి భయపడి, ప్రసన్నం చేసుకోవడానికి జగన్ ఇలా చేశారంటూ విమర్శలకూ పదునుపెట్టారు కొందరు. ఒడిశా కాంగ్రెస్ ఎంపీ జగన్ కు రీట్వీట్ చేస్తే, తమిళనాడు జయలలిత సన్నిహితురాలు శశికళ పేరిటా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
 
సీపీఐ నేత నారాయణ వంటి వారు జగన్ తీరుపై కన్నెర్ర చేశారు. ఏదేమైనా ఈ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్నో, రాష్ట్ర ప్రభుత్వాలనో భాధ్యులను చేయడం సరికాదు. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని కొంత రిలాక్స్ అవడం ముమ్మాటికీ తప్పే. అయితే రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం ఎంతో అవసరం. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా వున్న కారణంగా మన దేశానికి కరోనా మహా సంక్షోభాన్ని ఎదుర్కోవడం కష్టమే. అసాధ్యం మాత్రం కాదు.ఈ కష్ట కాలంలో ప్రభుత్వాలను తిడుతూ, తమ విధిని మర్చిపోకుండా ప్రజలు సైతం సూచనలను పాటిస్తూ జాగ్రత్తలు పాటించడంతోనే విజయం సాధ్యం.