ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహిస్తారా? సౌరవ్ గంగూలీ ఆన్సర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ టోర్నీ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిరవధికంగా వాయిదావేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఊహించని రీతిలో బయో బబుల్‌లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.
అయితే మిగిలిన లీగ్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు.. అసలు సాధ్యమేనా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారా అని ప్రశ్నించగా.. అది సాధ్యం కాదు. ఇండియన్ టీమ్ శ్రీలంక వెళ్తోంది. పైగా 14 రోజుల క్వారంటైన్‌లాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
ఐపీఎల్ ఇండియాలో అసలు కుదరదు. ఈ క్వారంటైన్ చాలా కష్టం. ఐపీఎల్‌ను పూర్తి చేయగలమా లేదా అన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేము అని గంగూలీ అన్నారు. ఇక ముందుగానే ఐపీఎల్‌ను రద్దు చేసి ఉండాల్సిందన్న విమర్శలపైనా దాదా స్పందించారు. ముంబై, చెన్నైలలో ఇలా జరగలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లినప్పుడు బబుల్‌లోకి కూడా కరోనా వచ్చింది.
ఆ సమయంలో దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గతేడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ చాలా తక్కువ కేసులు ఉండటంతో ఇంగ్లండ్ సిరీస్‌తోపాటు డొమెస్టిక్ క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహించాం. కొన్ని వందల మంది ప్లేయర్స్ బబుల్‌లో ఉన్నా ఏ సమస్యా రాలేదు అని దాదా వివరించారు.
ఇంగ్లీష్ ప్రిమియర్ లీగ్‌లోనూ కేసులు వచ్చాయి. అయినా వాళ్లు లీగ్‌ను కొనసాగించారు. ఐపీఎల్ అలా కాదు. వారం పాటు ఆపితే ఇక అంతే. ప్లేయర్స్ ఇళ్లకు వెళ్లిపోతారు. మళ్లీ వస్త క్వారంటైన్. ఇలా అన్నీ మొదటి నుంచీ మొదలవుతాయి అని గంగూలీ అభిప్రాయపడ్డారు.