గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:55 IST)

రుషికొండపై ప్యాలెస్‌ను ఫోటో తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏం చేయబోతున్నారు?

Pawan Kalyan Visits Vizag Rushikonda Palace
కర్టెసి-ట్విట్టర్
రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యంత ఖరీదైన కట్టడాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం సందర్శించారు. అక్కడ ఆ భవనాలను తన సెల్ ఫోనులో ఫోటోలు తీసుకున్నారు. దీనితో ఈ నిర్మాణాలను ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. రాష్ట్రానికే తలమానికంగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో విశాఖపట్టణంలోని రుషికొండ ఒకటి. ఈ కొండను తొలిచిన గత వైకాపా ప్రభుత్వం అత్యంత ఖరీదైన, లగ్జరీ భవనాలను నిర్మించిన వ్యవహారం తెలిసిందే. ఈ భవనాల నిర్మాణ సమయంలో అటు వైపు ఏ ఒక్క రాజకీయ నేతను వెళ్ళనీయకుండా పోలీసులను 24 గంటల పాటు కాపాలా పెట్టింది. రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగింది. వైకాపా ప్రభుత్వం స్థానంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 
Pawan Kalyan Visits Vizag Rushikonda Palace
రుషికొండపై జగన్ సర్కార్ రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో ఏడు బ్లాకులను నిర్మించింది. ఈ భవంతుల్లో కల్పించిన సౌకర్యాలను చూస్తే ప్రతి ఒక్కరికీ కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. రాజప్రాకారాలను తలదన్నేలా ఈ భవనాలను నిర్మించారు. కోస్టల్ జోన్‌ నిబంధనలు, పర్యావరణ ఆంక్షలను ఉల్లఘించి, కోర్టులను సైతం తప్పుదారి పట్టించి ఈ భవనాలను నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇపుడు కూటమి ప్రభుత్వం ఈ భవనాలను ఏం చేస్తుందన్న దానిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది. ప్రజలు మాత్రం ఈ భవంతులను ఒక లగ్జరీ హోటల్ (7స్టార్ హోటల్)గా తీర్చిదిద్ది పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. 
 
Pawan Kalyan Visits Vizag Rushikonda Palace
నిజానికి ఈ భవాలను నిర్మించిన ప్రాంతంలో ఏపీ టూరిజంకు చెందిన హరిత రిసార్ట్స్ ఉండేది. దీనిద్వారా యేడాదికి రూ.7 కోట్లు నుంచి రూ.10 కోట్ల మేరకు ఆదాయం వచ్చేది. అలాంటి హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసిన గత ప్రభుత్వం.. ఈ భవనాలను నిర్మించింది. అదీ కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించింది. ఈ భవంతుల్లో ఉన్న మరుగుదొడ్డే ఏకంగా మూడు సెంట్ల విస్తీర్ణంలో ఉన్నదంటే ఇక హాలు, పడక గదులు ఏమేరకు సువిశాలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండ భవనాలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.