శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (10:37 IST)

రంగంలోకి రాజగురు... రాహుల్‌కు మార్గదర్శిగా ప్రణబ్?

రాజకీయ అపరచాణక్యుడిగా పేరుగడించిన ప్రణబ్‌ ముఖర్జీ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజగురువుగా, ఆ పార్టీ యువనేతకు మార్గదర్శిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ఇ

రాజకీయ అపరచాణక్యుడిగా పేరుగడించిన ప్రణబ్‌ ముఖర్జీ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజగురువుగా, ఆ పార్టీ యువనేతకు మార్గదర్శిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
 
రాష్ట్రపతిగా ప్రణబ్ రిటైర్ అయ్యాక ఆయన రాజాజీ మార్గ్‌లోని ఎనిమిదో నంబర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌లు పదేపదే కలుస్తూ... పార్టీకి మార్గదర్శిగా వ్యవహరించాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో ఆయన కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. 
 
2019 ఎన్నికల్లో మోడీకి ధీటుగా రాహుల్‌ను తీర్చిదిద్దడంలో ప్రణబ్‌ తన వంతు పాత్ర పోషిస్తారని, ఆయన అపార రాజకీయ అనుభవంతో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రణబ్‌ కాంగ్రెస్‌ మార్గదర్శి బాధ్యతలను చేపట్టడం ఖాయమన్నట్లుగా ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
 
ప్రణబ్‌ తన ఆత్మకథ మూడో పుస్తకం (సంకీర్ణ సంవత్సరాలు 1996-2012) ఆవిష్కరణను పురస్కరించుకొని ఓ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇదే చెబుతోంది. ఆ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ను ప్రణబ్‌ వెనకేసుకొచ్చారు. 132 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీని తక్కువగా అంచనా వేయకూడదని, తప్పకుండా మళ్లీ లేచి నిలబడుతుందని నొక్కివక్కాణించారు. ఈ మాటల వెనుక పరమార్థం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.