అన్నా... ఇక్కడ ఉద్యోగం ఏం చేస్తాం. కరెంటు బిల్లు పెంచేసారు, చెత్త పన్ను వేసారు, అద్దె ఇంటి ఓనర్లు మెయింటినెన్స్ పెంచేసారు, ఉన్న ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామంటే అక్కడ వేరే గింజలు పండించాలంటున్నారు. పోనీ కౌలుకు ఇద్దామంటే ఎకరాకి 6 బస్తాలకు మించి ఇవ్వమని చెప్తున్నారు కౌలు రైతులు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాక, ఇటు ఉద్యోగంలో డబ్బులు మిగలక చానా ఇబ్బందులు పడుతున్నాం. అంతెందుకు... ఉదయాన్నే టౌనులో టిఫిన్ చేద్దామంటే రూ. 150కి పెట్టినా కడుపు నిండటంలేదు. ఎంత సంపాదన వచ్చినా ఎటు పోతుందో తెలియడంలేదు. ఏమవుతుందో అర్థం కావడంలేదు. ఇదీ... విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో చిన్న, మధ్యస్థాయి ఉద్యోగాలు చేసుకుంటున్నవారి పరిస్థితి.
నవరత్నాలు ఉచిత పథకాలు... ఏపీలో ఏం జరుగుతోంది?
ఉచితి పథకాలు. ఇవి ఇప్పటివి కాదు. ఆనాటి ఏపీ సీఎం ఎన్టీఆర్ కాలం నుంచి వున్నాయి. ఆనాడు దారిద్ర్య రేఖకు దిగువన వున్న పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం దేశంలోనే పేరు తెచ్చుకుంది. ఐతే అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు పదుల్లో ఉచిత పథకాలు అమలులో వున్నాయి. నెల గడిస్తే చాలు కోట్ల రూపాయలు ఉచితంగా జనం ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలలో కొన్నింటిని చూస్తే...
వైఎస్సార్ రైతుభరోసా
ఫీజు రీయెంబర్స్‌మెంట్
ఆరోగ్యశ్రీ
వైఎస్సార్ ఆసరా
అమ్మ ఒడి
వైఎస్సార్ చేయూత
జగనన్న ఇళ్లు...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. వీటన్నిటికీ అర్హులైన వారికి ప్రభుత్వం ఉచితంగా నగదు పంపిణీ చేస్తోంది. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బకాయి రుణం రూ. 3.89 లక్షల కోట్లను తాకింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 40,000 కోట్ల పెరుగుదలను నమోదు చేసింది. ఇది స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 32.4 శాతంగా ఉంది. దీనితో తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టేందుకు వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఫలితంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. పథకాల కోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ అప్పుల నుంచి బైట పడేందుకు దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఇటీవల పెంచిన కరెంటు చార్జీలు, ఆస్తి పన్ను, భూ రిజిస్ట్రేషన్ చార్జీలు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
అప్పులు తెచ్చుకోవడంలో యూపీ టాప్, ఏపీ నాలుగో స్థానం
ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అధికార బిజెపి వాగ్దానం చేసింది. అందుకోసం ఆ రాష్ట్రం అప్పులు చేయాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో యూపీ ఆదాయాలు కేవలం 5 శాతం మాత్రమే పెరిగినప్పటికీ, వడ్డీ చెల్లింపులు 6 శాతం పెరిగాయని కాగ్ డేటా వివరిస్తోంది. రూ. 6.53 లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే నెం.1 అప్పుల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ వుంది.
ఆ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో విపరీతంగా అప్పులు చేసి పైపైకి వచ్చేస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ రూ. 5.62 లక్షల కోట్లతో వుండగా, మూడో స్థానంలో రూ. 5.02 లక్షల కోట్లతో గుజరాత్ రాష్ట్రం వుంది. ఇక నాలగవ స్థానంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 3.98 లక్షల కోట్ల అప్పులతో నిలిచింది.
అప్పులతో అధ్వాన్న రాష్ట్రంగా పంజాబ్
పంజాబ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల్లో గెలవడానికి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ప్రజలకు హామీ ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పథకాల కోసం ఖజానాకు సంవత్సరానికి రూ. 20,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని సూచిస్తున్నారు. గత ఐదేళ్లలో పంజాబ్ బకాయి రుణం రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ. 2.82 లక్షల కోట్లకు చేరుకుంది.
అదృష్టవశాత్తూ, పంజాబ్ వడ్డీ చెల్లింపులు దాని ఆదాయాలతో పోలిస్తే గత నాలుగేళ్లలో 3 శాతం మాత్రమే పెరిగాయి. అయితే, 2021-22లో 53 శాతానికి చేరుకుని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో పంజాబ్ అత్యంత అధ్వాన్నమైన రుణ-GSDP నిష్పత్తిని కలిగి వున్న రాష్ట్రంగా రికార్డుకెక్కింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఆప్ పాలన ప్రారంభించింది. అప్పుల కుప్పగా వున్న పంజాబ్ రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు కేజ్రీవాల్ కష్టపడక తప్పదంటున్నారు. మొత్తంగా చూస్తే... 2021-22లో అత్యధిక రుణ-GSDP నిష్పత్తి కలిగిన రాష్ట్రాలుగా పంజాబ్ (53.3 శాతం), రాజస్థాన్ (39.8 శాతం), పశ్చిమ బెంగాల్ (38.8 శాతం), కేరళ (38.3 శాతం), ఆంధ్రప్రదేశ్ (32.4 శాతం)గా వున్నాయి.
ఆర్బీఐ వార్నింగ్
గత నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల బడ్జెట్‌లను సమీక్షిస్తూ, 18 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రుణ-GSDP నిష్పత్తి గత 10 ఏళ్లలో 22.6 శాతం నుండి 31.2 శాతానికి పెరిగిందని తెలిపింది. రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం బకాయి రుణంలో అతిపెద్ద భాగం అయిన మార్కెట్ రుణాలు మార్చి 2022 నాటికి వారి జిడిపిలో 63.6 శాతానికి చేరుకున్నాయని ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది.
PK విన్నింగ్ ఫార్ములా కూడా కారణమా?
ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజలను ఆకర్షించాలి. గత కొన్నేళ్లుగా ఉచిత పథకాలతోనే ప్రజల ఓట్లను రాబట్టుకుంటున్నాయన్న వాదన లేకపోలేదు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసిపికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేసారు. విజయం సాధించాలంటే కొన్ని ఉచిత తాయిలాలు విసరాలనే వ్యూహం పీకే ఫార్ములాలో వుంటాయని చెపుతుంటారు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి రావడానికి పీకే వ్యూహాలు వున్నాయి.
కనుక పీకే ఫార్ములాలు కూడా ఆయా రాష్ట్రాల అప్పుల బెడదకు కారణం అవుతున్నాయా అనే వాదనలు సైతం వస్తున్నాయి. పీకే ఫార్ములాలను చూసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా అలాంటి ఫార్ములాలను అప్లై చేసి ఇబ్బందుల్లో పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. కాగా వచ్చే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు పీకీ కొన్ని పాయింట్లు చెప్పారట. ఆ పాయింట్లను కాంగ్రెస్ వృద్ధ నేతలు అంగీకరించడంలేదని, అందువల్లనే పీకే ఒకటికి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో భేటీలు అవుతున్నారనే వాదన వినబడుతోంది.