శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

వైసీపీపై బీజేపీ వత్తిడి పెంచుతోందా..? ఎన్డీయేలోకి ప్రవేశం ఉభయతారకమా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ంలో రాజకీయాలు కమలనాథులకు అనుకూలంగా ఉన్నాయా? అధికార వైసీపీని ఎన్డీయే గూటికి తీసుకు వచ్చేందుకు బిజెపి వేస్తున్న బాట ఏమిటి..? వైసీపీ అధినేత జగన్‌కు ఉభయతారక మంత్రాన్ని బోధిస్తూనే ప్రధాని మోదీ వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారా....? ప్రత్యేక హోదా జపాన్ని పక్కనబెట్టి జగన్ తమతో జతకట్టే పరిస్థితులను కేంద్రమే తీసుకువస్తోందా? అటు తెలుగుదేశాన్ని బూచిగా చూపెడుతోందా..?
 
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు... ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా తమ విధానాలను, వ్యూహాలకు పదును పెడితే, జాతీయ పార్టీలు ఢిల్లీ పీఠం పైన దృష్టిపెట్టి మరీ ఆచితూచి అడుగులు వేస్తాయి. ప్రస్తుతం జాతీయ పార్టీగా బిజెపి, ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ముఖ్యం. 
 
తాజా జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఎన్డీయేకు శిరోమణి అకాలీదళ్ దూరం కాగా, అంతకుముందే అత్యంత విశ్వాసపాత్రంగా భావించే శివసేన ఎన్డీయే‌కు గుడ్ బై చెప్పింది. ఈ పరిస్థితులలో తిరిగి ఎన్డీయేను పటిష్టం తీసుకోవటం కమలనాథుల ముందున్న ప్రథమ లక్ష్యం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో సమావేశం కావడంతో తాజాగా వైసిపి ఎన్డీఏలో చేరుతుందన్న అనుమానాలు మరోమారు తెరపైకి వచ్చాయి. 
 
పదిహేను రోజుల క్రితమే ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన్, అప్పుడు కేంద్ర హోంమంత్రి, బిజెపి కీలక నేత అమిత్ షాతో రెండు పర్యాయాలు సమావేశం కావడం, ఈమారు పర్యటనలో ప్రధాని మోడీతో జగన్ కీలక చర్చలు జరపటం అనుమానాలను బలపడేలా చేశాయి. చర్చల కోసం మోదీ నుంచి పిలుపు అందిన తర్వాతే జగన్ హస్తిన పర్యటన సాగినట్లు తెలుస్తోంది.
 
ఏపీలో పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతరత్రా చర్చించడానికే కేవలం జగన్ హస్తినకు వెళ్లారు అనుకోవడానికి అవకాశం లేదు. ఇంతకుముందు పర్యటనలోనే అన్ని విషయాలను జగన్ ప్రస్తావించారు. అయితే ప్రధానితో జరిగిన జగన్ సమావేశంలో ఎన్డీయేలో చేయాల్సిందిగా వైసీపీ అధినేతను మోడీ నేరుగా అడిగినట్లు తెలుస్తోంది.
 
ఎన్డీఏలో చేరితే లభించే అవకాశాలను ప్రధాని వివరించినట్లు, దానితో పాటు కేంద్రంలో రెండు క్యాబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో ఏడాది క్రితమే అమిత్ షా, వైసీపీకి ఎన్డీయేలో చేరేందుకు ఆఫర్ ఇచ్చారు. అయితే అప్పట్లో డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని చెప్పినా, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే షరతులు లేకుండా చేరడానికి సిద్ధమని అప్పట్లో జగన్ తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే అది జరగలేదు.
 ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం మరుగున పడింది. సంక్షేమ పథకాల పైనే జగన్ ప్రభుత్వం దృష్టి సారించి మేనిఫెస్టో పక్కాగా అమలు చేస్తోంది. 
 
ఇలావుంటే ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన, బీజేపీ తో జతకట్టి ఏపీలో కలిసికట్టుగా సాగుతోంది. మరి ఇప్పుడు వైసీపీ ఎన్డీయేలో చేరేందుకు మొగ్గు చూపితే పరిస్థితి ఏంటి?. బీజేపీతో అటు జనసేన, వైసీపీ కలిసి ముందుకు సాగగలుగుతాయా, లేక జనసేనకు చెక్ పడుతుందా.. అన్నది సందేహంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందటం ఎంతో ముఖ్యం. కేంద్రం సహకారం ఉంటేనే వైసీపీ ప్రభుత్వం నెట్టుకు రాగలిగే పరిస్థితులున్నాయి.
 
అదీకాక ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్డీయేలోకి మళ్ళీ ప్రవేశిస్తే పరిస్థితులు వైసిపికి కొంత ఇబ్బందికరంగా మారటం ఖాయం. కాబట్టి ఆ అవకాశం టిడిపికి ఇచ్చేందుకు వైసిపి ఇష్టపడుతుందా... అయితే తెలుగుదేశాన్ని మళ్లీ ఎన్డీయేలోకి ఆహ్వానించడానికి కమలనాథులు సిద్ధంగా లేరు. తమతో విడిపోయి ఒంటికాలిపై లేచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని బిజెపి అగ్రనాయకత్వం చూస్తోంది. అందుకే వైసీపీకి గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న జనసేనతో పాటు వైసీపీ, టీడీపీలలో ఏదో ఒక దానిని ఎన్డీయేలోకి తెచ్చుకుంటేనే కమలనాథులకు కాలం కలిసి వస్తుంది.
 
ఈ పరిణామాలలోనే వైసీపీపై బిజెపి ఒత్తిడి పెంచుతోంది. ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలిగిన తరువాత తమకు వచ్చిన నష్టం లేకపోయినా, కేవలం రెండు సీట్ల బలం వున్న అకాలీదళ్ స్థానంలో 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్న వైసీపీని రాబట్టగలిగితే కేంద్రంలోఎన్డీఏ బలం మరింత పుంజుకుంటుంది. అదీకాక రాజ్యసభలోనూ బలం పెంచుకోవచ్చు. రాబోయే రెండేళ్లలో ఏపీలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు కూడా వైసిపి పరం అవుతాయి. 
 
కాబట్టి ఎటుచూసినా జగన్మోహనంగా వైసీపీని ఆకర్షించగలిగితే, కమలనాథులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో తమకు బలం లేని లోటు తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా గెలిచే పరిస్థితి బీజేపీకి లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో తెలంగాణపైనే బిజెపి ఎక్కువ దృష్టి పెట్టింది. అదీకాక తమిళనాడులో అన్నాడిఎంకే బీజేపీ వెనకే నడుస్తోంది.
 
రచన... వెలది కృష్ణకుమార్
సీనియర్ జర్నలిస్ట్,
హైదరాబాద్.