1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (11:26 IST)

జయేంద్ర సరస్వతి చుట్టూ వివాదాలెన్నో... తెలంగాణా ఇస్తే అది మరో కాశ్మీరే

శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చుట్టూ ఎప్పటి నుంచో అనేక వివాదాలున్నాయి. కేవలం ఆధ్యాత్మిక విషయాల్లోనేకాకుండా రాజకీయాల్లో కూడా తలదూర్చి విమర్శలు మూటగట్టుకున్నారు.

శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చుట్టూ ఎప్పటి నుంచో అనేక వివాదాలున్నాయి. కేవలం ఆధ్యాత్మిక విషయాల్లోనేకాకుండా రాజకీయాల్లో కూడా తలదూర్చి విమర్శలు మూటగట్టుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తే అది మరో కాశ్మీర్‌లా మారే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించి తెలంగాణ ప్రజలు, రాజకీయ నేతల ఆగ్రహానికి గురయ్యారు. 
 
అంతేకాకుండా, విభజనతో తెలంగాణలో అన్యమతస్తులు తిష్టవేస్తారని, తద్వారా మతకలహాలు చెలరేగుతాయని వ్యాఖ్యానించారు. అందుకే విద్వేషాలు మానుకుని ప్రజలందరూ కలసి సహజీవనం చేయాలని జయేంద్ర సరస్వతి హితవు పలికారు. ముఖ్యంగా తెలంగాణా కోసం విద్యార్థులను సమిధలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పట్లో కంచి జయేంద్ర సరస్వతి వ్యాఖ్యలను తెలంగాణా రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ఆధ్యాత్మికపరమైన బోధనలు చేయాల్సిన కంచి పీఠాధిపతికి ఈ విషయాలు ఎందుకని సూటిగా ప్రశ్నించింది.
 
అలాగే, కంచి మఠం నుంచి 1987, ఆగస్టు 22న ఆయన అకస్మాత్తుగా మాయమైపోయారు. అలా అదృశ్యం కావడం మఠం నియమావళికి వ్యతిరేకం. అప్పట్లో జయేంద్ర సరస్వతి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరికి ఆయన కర్నాటక కూర్గ్‌లోని తలకావేరి వద్ద కనిపించారు. ఆయన అలా మాయంకావడం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. 
 
మరోవైపు, రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించడానికి మూడు పక్షాలు ఉండాలని, అందులో తనను ఒక వర్గంగా చేర్చాలని జయేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తరాది స్వామీజీలు తప్పుబట్టారు. ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మఠాన్ని కలుషితం చేయడమేనన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. 
 
ఆయనపై హత్య కేసు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంచీపురంలోని శ్రీ వరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజరు శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులిద్దరూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయన కొన్ని నెలల పాటు జైలుజీవితం కూడా గడిపారు. అలాగే, కంచి మఠానికి వచ్చిన పలువురు అమ్మాయిలతో రాసలీలలు జరిపారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆరోపణల నుంచి ఆయన బయటపడ్డారు.