1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (12:53 IST)

మోదీ 3 రైతు చట్టాలు, జగన్ 3 రాజధానులు: ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు క్షమాపణలు కూడా తెలియజేశారు. ఆందోళన చేస్తున్న రైతులందరూ వారివారి స్వస్థలాలకి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తను ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. గత రెండేళ్లుగా రైతులు అమరావతి రాజధాని కోసం ఆందోళలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు 3 రాజధానుల వ్యవహారంపై రోజువారీ విచారణ చేపట్టింది. దీనితో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

 
ఈ క్రమంలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి అని ప్రకటించారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలని, నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించింది, అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని.

 
 రాష్ట్ర రాజధానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని, అందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర హోంశాఖ గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తెలియజేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 6 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం మార్చి 28, 2014న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసేందుకు శివరామకృష్ణన్ ఏర్పాటైంది.


ప్యానెల్ అదే సంవత్సరం ఆగస్టు 30న తన నివేదికను సమర్పించింది. దానిని రెండు రోజుల తర్వాత సెప్టెంబరు 1న ఏపీ ప్రభుత్వానికి పంపింది. రాజధాని నగరానికి అమరావతి పేరు పెట్టాలని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23, 2015న ఉత్తర్వులు జారీ చేసిందని అఫిడవిట్ పేర్కొంది. ఒక రాష్ట్ర రాజధాని నగరాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టీకరించింది.

 
జూలై 31, 2020న రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించబడిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం, 2020 ద్వారా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు పాలన స్థానాలు ఉండాలని అఫిడవిట్‌లో పేర్కొంటూ వాటిని 3 రాజధానులుగా పిలవాలి. దీని ప్రకారం అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ‘లెజిస్లేటివ్ క్యాపిటల్’గానూ, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’గానూ, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాను ‘జుడీషియల్ క్యాపిటల్’గానూ పిలుస్తారని తెలిపింది.

 
ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతిని ప్రకటించాలనే డిమాండ్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత వైఎస్ చౌదరి గత వారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మద్దతివ్వాలని బీజేపీ తరఫున తీర్మానం చేశామనీ, అమరావతిలో రాజధాని ఉండేలా చూస్తుందని చౌదరి అన్నారు. 2019కి ముందు అన్ని పార్టీలు అసెంబ్లీ వేదికపై చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేము సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. రైతులకు మా బహిరంగ మద్దతును తెలియజేస్తున్నామని తెలిపారాయన. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.