శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (12:02 IST)

తెలంగాణలో పురుడు పోసుకోనున్న కొత్త పార్టీ.. తర్వాత ఆంధ్రాలో..!

బీసీనేత కృష్ణయ్య కొత్త పార్టీ
పరిశీలనలో నాలుగు పేర్లు
త్వరలో పేరు ఖరారు
అట్టడుగు ప్రజల అభివృద్ధి లక్ష్యం
కమిటీలలో దగ్గరి వాళ్ళే.. 
 
తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోనుంది. అదీ వెనుకబడిన కులాల, సంఘటిత, అసంఘటిత కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజల నేపథ్యంలో ఓ పార్టీ ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సవాల్ విసిరేందుకు కొత్త పార్టీ అధినేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బీసీ సంఘనేత, మాజీ ఎమ్మెల్యే రాగ్య కృష్ణయ్య త్వరలోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నారు.
 
ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. భవిష్యత్‌లో కూడా అవకాశం వస్తుందో...? రాదో...? అన్న ఆందోళన బీసీలలో అంతర్గతంగా ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ ఒక్కసారి బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, భవిష్యత్తులో తప్పకుండా బీసీల నుంచే ముఖ్యమంత్రి అవుతారనే లక్ష్యంగా కృష్ణయ్య వ్యూహాలు చేస్తున్నారు. 
 
ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా బీసీల కోసం చేసిందేమీ లేదని కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తూ లబ్ధి పొందుతున్నారే తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బీసీ సంఘాల నుంచి పార్టీ పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని అందువల్ల పార్టీ పెట్టాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. అందుకు తగ్గ ఏర్పాట్లు నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు.
 
ముందు తెలంగాణ... తర్వాత ఆంధ్రలో: 
ఈ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై కసరత్తులు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణ విషయం తెలంగాణ తర్వాత ఆలోచన చేయాలనే ఆయన భావిస్తున్నారు.
 
నో 'పొత్తుల్స్' - ఓన్లీ వన్ 'ఎ...లోన్':
తాము ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఒంటరిగా బరిలోకి దిగి బిసీల సత్తా చూపాలని కృష్ణయ్య భావిస్తున్నారు. 
 
ఇవే పరిశీలనలోని పార్టీ పేర్లు :
కృష్ణయ్య మదిలో ఉన్న పార్టీ పేర్లు ఈ విధంగా ఉన్నాయి. బీసీ జనసమితి, బీసీ జనసేన, బీసీ ప్రజాపార్టీ, బీసీ ప్రజా సమితి తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ పేర్లకు తెలంగాణ జోడిస్తే బాగుంటుందనే భావన కూడా ఉంది. ఇవి ఎన్నికల సంఘంలో ఇంకా రిజిస్ట్రేషన్ కాని పేర్లు కావడంతో.. కృష్ణయ్య ఏదో ఒక పేరు ఖారారు చేసుకునే అవకాశం ఉంది. 
 
ఈ లాజిక్ వర్కవుట్ అవుతుందా..?:
ప్రాంతీయ వాదం బలపడటానికి నెలల సమయం పడుతుందని, మతవాదం బలపడటానికి ఆరు నెలల పడుతుందని, బీసీ వాదం బలపడేందుకు కేవలం నెలరోజుల సమయం సరిపోతుందనే ప్రణాళికలో కృష్ణయ్య ఉన్నారు.
 
వత్తిడి కూడా ఉంది: 
కొత్త పార్టీకోసం బీసీలు తహతహలాడుతున్నట్లు, ఇప్పటికే మేధావులతో కృష్ణయ్య చర్చించినట్లు, బీసీ వాదం బలంగా ఉన్న నేపథ్యంలో పార్టీ పెట్టాల్సిందేనని అన్నారు.