పెద్దలు అంగీకరించకుంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాళ్లం : కీర్తి సురేశ్
తమ పెద్దలు అగీకరించకుంటే పారిపోయి పెళ్లి చేసుకుని వుండేవాళ్ళమని హీరోయిన్ కీర్తి సురేశ్ అన్నారు. తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటితల్‌ను గత 2024లో ఆమె వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగం వైభవంగా జరిగింది. ఈ మధుర క్షణాలను ఆమె మరోమారు గుర్తు చేసుకున్నారు.
'15 ఏళ్లు ప్రేమలో ఉన్నాం. పెళ్లి అలా వైభవంగా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. మేం ఖచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకున్నాను. కానీ, ఇంట్లో అంగీకరించడంతో ఘనంగా జరిగింది. దీంతో కల నిజమైనట్లు అనిపించింది. అందుకే మా వివాహ వేడుకలో నేను భావోద్వేగానికి గురయ్యాను.
ఒక్క క్షణం నోట మాట రాలేదు. 15 ఏళ్ల ప్రేమ 30 సెకన్లలో తాళి కట్టే సమయంలో కళ్ల ముందు కదలాడింది. దీంతో ఆనందబాష్పాలు ఆగలేదు. ఆంటోనీ కూడా నమ్మలేకపోయాడు. అందుకే అతడు కూడా ఎమోషనల్ అయ్యాడు. మొదటిసారి ఆంటోనీ కళ్లల్లో నీళ్లు చూశాను. ఇది ఓ అందమైన ప్రయాణం' అని కీర్తి గుర్తుచేసుకున్నారు.