సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (15:59 IST)

రాష్ట్రంలో వైకాపా దమనకాండ : డీజీపీకి బాబు సుధీర్ఘ లేఖ

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు, బెదిరింపులు, ఆస్తుల విధ్వంసాలు, గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం గురించి, గతంలోనే మీ దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది.
 
 రాష్ట్రవ్యాప్తంగా 545 పైగా కుటుంబాలు వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక, 100 రోజులకుపైగా ఎక్కడెక్కడో తలదాచుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది. 
 
భౌతిక దాడులతో శారీరకంగా హింసించడం, బెదిరింపులతో మానసికంగా వేధించడం, ఆస్తుల ధ్వంసం ద్వారా ఆర్ధిక మూలాలు దెబ్బతీసే ఫాసిస్ట్‌ దమనకాండకు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనార్టీలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు వైసిపి నేతలు పాల్పడుతోన్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం అమానుషం.

ఇళ్లపై సామూహిక దాడులు చేయటం, భూములు బీడులు పెట్టడం, గ్రామాల నుంచి వెళ్లగొట్టడం, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం, చీనీ చెట్లు, దానిమ్మ, బత్తాయి, కొబ్బరి చెట్లు నరికివేయటం, బోర్లు ధ్వంసం చేయడం, కాంట్రాక్టర్లపై దాడులు చేసి మెషీనరి ధ్వంసం చేయడం, సోలార్‌ ప్లాంట్లపై దాడులు చేసి సౌర ఫలకాలు పగులకొట్టడం, తుపాకీ చూపి కంపెనీల ప్రతినిధులను బెదిరించడం జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మిన్నాస్తిగా వ్యవహరించడం గర్హనీయం. 
 
వైకాపా నేతల ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్సహాయంగా మారినందు వల్లే ఈ దుష్పలితాలన్నీ... బడుగు బలహీన వర్గాల ప్రజలు నిర్భయంగా సొంతూళ్లలో తలెత్తుకుని జీవించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ పేదల పక్షానే పనిచేసింది. గత 100 రోజులుగా ప్రజలపక్షాన నిలబడిన తెలుగుదేశం పార్టీ నేతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. 
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 చోట్ల దాడులు, దౌర్జన్యాలు  జరిగాయి. 10 మందిని కిరాతకంగా హత్య చేశారు. వందలాది కుటుంబాలను స్వగ్రామాల నుంచి తరిమేశారు. అనేకమందిపై అక్రమ కేసులు బనాయించారు. 12 మంది టీడీపీ శాసనసభ్యులు, మాజీ శాసన సభ్యులపై తప్పుడు కేసులు పెట్టారు.
 
 01-07-2019న సమర్పించిన లేఖలో ఈ విషయాలన్నింటినీ మీకు వివరించడం జరిగింది. అయినా చర్యలు లేనందువల్లే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చాం. అందులో తొలిగా ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమం చేపట్టాం. 
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మూడు నియోజకవర్గాలలో 16 గ్రామాల్లో జరుగుతున్న దారుణాలు, అరాచకాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే ''చలో ఆత్మకూరు'' పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. 
 
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను వివరిస్తూ  ''నాగరిక ప్రపంచంలో అనాగరిక పాలన - పులివెందుల ఫ్యాక్షనిజం గుప్పిట్లో రాష్ట్రం'' పేరుతో మరో పుస్తకం ప్రచురించి విడుదల చేశాం. వైసిపి ప్రభుత్వ బాధిత కుటుంబాల వివరాలు, వాళ్లపై దౌర్జన్యాల గురించి ఆయా పుస్తకాలలో అన్ని ఆధారాలతో సహా మీకు అందజేస్తున్నాం.
 
 తుఫాన్లు, భూకంపాలు తదితర ప్రకృతి విపత్తులలోనే, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తారు. అలాంటిది 'వైసీపీ ప్రభుత్వ బాధితులకు పునరావాస కేంద్రం' ఏర్పాటు చేయటం దేశంలోనే ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ 11న 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చిన తర్వాత ముందస్తు నోటీసులులేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేయడం చట్ట వ్యతిరేకం. 
 
నేనుండే ఇంటి గేట్లకు తాళ్లు కట్టి నన్ను బైటకు వెళ్లకుండా నిర్భంధించడం, నా నివాసానికి ఎవరినీ రాకుండా అడ్డుకోవడం పౌర విధులనే కాదు, నా బాధ్యతలను కూడా కాలరాయడమే. శాంతిభద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, బాధితులు అందరికీ న్యాయం చేయాల్సిన హోం మంత్రే, బాధితులను పెయిడ్‌ ఆర్టిస్టులని అవమానించారు. తమను ఊళ్లలో నుంచి వెళ్లిపొమ్మన్నారని బాధితులే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలి. 
 
బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ముందుకు వచ్చిన టీడీపీ నేతలను అక్రమంగా నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనార్టీ నేతలను, మహిళలను గంటకో పోలీస్‌ స్టేషన్‌‌కు తరలించి అనేక అవస్థలకు గురిచేశారు. 
 
చివరికి పునరావాస శిబిరంలో ఉన్న బాధితులకు తాగునీరు, పాలు, ఆహారం అందించకుండా అడ్డుకోవడం బాధాకరం. 9 రోజులు శిబిరంలో ఉన్నా పట్టించుకోకుండా, సెప్టెంబర్‌ 11న గుంటూరు శిబిరంలో ఉన్న 157 కుటుంబాలను ఉన్నఫళంగా బస్సుల్లో ఎక్కించి తరలించారు.
 
 సొంతూళ్లో నివసించే హక్కు కోసం పోరాడుతున్న బాధితులను పోలీసు అధికారులే తీసుకెళ్లి ఆయా గ్రామాలలో వదిలిపెట్టారు కాబట్టి బాధితుల రక్షణకు, ఆస్తుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. 
 
తెలుగుదేశం పార్టీ పాలనలో అత్యంత సమర్ధవంతమైన వ్యవస్థగా నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వంలో వైసిపి నేతల ఒత్తిళ్లతో నిర్వీర్యం కావడం దురదృష్టకరం. 
 
శిబిరం నుంచి తరలించిన కుటుంబాల యోగక్షేమాలను విచారించేందుకు, బాధితులను పరామర్శించేందుకు, వచ్చే వారం టీడీపీ నేతల బృందం ఆయా గ్రామాల్లో పర్యటిస్తుంది. ఈ వారం రోజుల్లో ఆయా గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దడమే కాకుండా, దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలలో అరాచకాలు జరిగిన ప్రాంతాలలో కూడా టిడిపి నేతల ప్రతినిధి బృందాలు త్వరలోనే పర్యటిస్తాయి. అన్నిచోట్ల ప్రశాంత పరిస్థితులు నెలకొల్పేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. 
 
ప్రజల ప్రాథమిక హక్కులు, పౌరహక్కులు కాపాడడంలో, ఆస్తులకు భద్రత కల్పించడంలో  పోలీసు యంత్రాంగం తమ విధులను సమర్ధంగా నిర్వహించాలని, బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో పేర్కొన్నారు.