#ChaloAtmakur చంద్రబాబు హౌస్ అరెస్టు ... గేట్లను తాళ్ళతో కట్టేసిన పోలీసులు..
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసం గేటు కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. పైగా, ఇంటి గేట్లను ప్లాస్టిక్ తాళ్లతో కట్టేశారు. దీంతో చంద్రబాబు కారు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది.
చంద్రబాబును బయటకురాకుండా గేట్లు వేసిన పోలీసులు... గేట్లను తాళ్లతో బంధించారు. గేటు వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు పలువురు కీలక నేతలు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.
ఇంటి నుంచి బయటకు రావడానికి చంద్రబాబు తన వాహనంలో కూర్చున్నప్పటికీ... పోలీసులు గేటు తీయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని మండిపడ్డారు.
మరోవైపు, ఛలో ఆత్మకూరు కార్యక్రమాని పూర్తిగా నీరుగార్చేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ టీడీపీ శ్రేణులు మాత్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. కానీ, పోలీసులు మాత్రం వారిని ఎక్కడికక్కడే బంధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మాజీ మంత్రులు అఖిలప్రియ, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా, మరికొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఇంత నిరంకుశత్వాన్ని తాను గతంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. శిబిరాల్లోని బాధితులకు ఆహారాన్ని కూడా అడ్డుకున్నారనీ, ఇంతకంటే అమానుషం ఏముంటుందని ప్రశ్నించారు. 'ఒక్కో టీడీపీ నేత ఇంటి ముందు ఇంత మంది పోలీసులను పెడతారా? బాధితులకు పోలీసులను అండగా ఉంచితే ఈ పరిస్థితి అసలు వచ్చేదా? సొంత ఊరిలో నివసించేందుకు టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం ఇది.
సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఇది. దానిమ్మ, చీనీ, కొబ్బరిచెట్ల నరికివేత అన్నది ఎక్కడైనా ఉందా? బాధితులకు సంఘీభావంగా ప్రజలంతా అందరూ నిరసనల్లో పాల్గొనాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు రాష్ట్రమంతా శాంతియుతంగా, ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా నిరసనలు తెలియజేయాలని సూచించారు. బాధితులకు మద్దతుగా తాము చేస్తున్న పోరాటం ఆగదనీ, టీడీపీ డిమాండ్లను పరిష్కరించాల్సిందేని చంద్రబాబు స్పష్టం చేశారు.