గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (17:15 IST)

ఏం తెలుసని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు...?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దళిత బహుజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. జనసేన ఐటీ విభాగానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఒక యువకుడు వేసిన ప్రశ్నకు సమాధానంగా రిజర్వేషన్లు లేని సమాజాన్ని కోరుకుంటు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దళిత బహుజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. జనసేన ఐటీ విభాగానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఒక యువకుడు వేసిన ప్రశ్నకు సమాధానంగా రిజర్వేషన్లు లేని సమాజాన్ని కోరుకుంటున్నాను. రిజర్వేషన్లు కొంతకాలమే ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు. అయినా ఇప్పటికీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రిజర్వేషన్లకు సంబంధించిన తన దృక్పథం ఏమిటో పూర్తిస్థాయి డాక్యుమెంటును వచ్చే యేడాది విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రాథమికంగా ఆయన ఆలోచన ఏమిటనేది బహిర్గతమైంది. పవన్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చాలామంది స్పందించారు. ఏం తెలుసునని పవన్ కళ్యాణ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దళిత మేధావులు విమర్శిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్‌ అభిమానులతో యుద్ధం చేస్తున్న సినీ విమర్శకులు, బహుజన వారి మహేష్‌ కత్తి, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజ్యాంగం మీద అవగాహన, రాజకీయ పరిణితికి పవన్ చాలా దూరం. కనీస పరిజ్ఞానం లేని ఇలాంటి స్టేట్‌మెంట్స్ పవన్ కళ్యాణ్‌ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని పవన్ దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని పవన్ ఇప్పుడు రిజర్వేషన్ల గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు.
 
కనీసం ఒక శాతం కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్లు ఫోజులిస్తున్నారు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం ఆయన మాట్లాడిన అక్షరం అక్షరంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడే కదా కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే సెన్పిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది దళితుల రిజర్వేషన్ల నిర్మూలనే ధ్యేయంగా ఉన్నట్లు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే అతని దళిత వ్యతిరేకత సుష్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే పవన్ కళ్యాణ్ స్థాయి అయితే మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే అని మహేష్ కత్తి తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. 
 
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన అభిప్రాయాలు.. దళిత, బహుజనులు అందరి అభిప్రాయాలుగా భావించలేనప్పటికీ రిజర్వేషన్లు కాదంటే ఆ వర్గాల్లోని పవన్ అభిమానులూ అంగీకరించలేదనేది వాస్తవం. రిజర్వేషన్లు కొంతకాలమే ఉండాలన్నది అంబేద్కర్ అభిప్రాయం కావచ్చు. కానీ నేటికి సమాజంలో దళితులు, గిరిజనులు, బహుజనులు అట్టడుగున ఉన్నారు. ఆర్థికంగా తీవ్రమైన అంతరాలున్నాయి. అందుకే రిజర్వేషన్ల అవసరం నేటికీ ఉంది. రిజర్వేషన్ల కోసం కొత్తగా డిమాండ్లు పుట్టుకొస్తున్నందుకు కారణం కూడా అదే. 
 
ఇలాంటి వాస్తవాన్ని గమనించకుండా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తరుణంలో ప్రతి అంశాన్ని ఆచితూచి మాట్లాడాలి. అయితే రిజర్వేషన్ల విషయంలో పవన్ యథాలాపంగా వ్యాఖ్యలు చేశారు. ఐతే ఇదే పవన్ నిశ్చితాభిప్రాయం అయితే, ఖచ్చితంగా పవన్‌ను దళిత గిరిజనులకు, బలహీనవర్గాలకు దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ వర్గాల మద్ధతు లేకుండా రాజకీయాల్లో ఏ పార్టీ అయినా రాణించడం సాధ్యం కాదు. పవర్ స్టార్ విషయంలోనూ ఇందుకు మినహాయింపు ఉండదనుకోవచ్చు.