వారిద్దరికీ ఐపీఎల్ - ఫ్యాషన్ షోలకు వెళ్ళే టైమ్ ఉంది.. రాజ్యసభకు రాలేరు... కానీ, రూ.లక్షల్లో వేతనం
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ మేటి నటి రేఖ. ఇద్దరూ ఇద్దరే! తాము ఎంచుకున్న రంగాల్లో అత్యుత్తములుగా నిలిచి జనం నీరాజనాలు అందుకున్న విజేతలు. తమ విశిష్ట సేవలకు గుర్తింపుగా గొప్ప పురస్కా
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ మేటి నటి రేఖ. ఇద్దరూ ఇద్దరే! తాము ఎంచుకున్న రంగాల్లో అత్యుత్తములుగా నిలిచి జనం నీరాజనాలు అందుకున్న విజేతలు. తమ విశిష్ట సేవలకు గుర్తింపుగా గొప్ప పురస్కారాలూ పొందారు. రేఖ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందితే.. సచిన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’నే దక్కించుకున్నారు.
ఇంతటి ఘనత సాధించిన ఈ ఇద్దరు ప్రముఖులు దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సభ్యులుగా మాత్రం అంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. పార్లమెంట్ సమావేశాలకు వీరు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తమపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులైన వీరిద్దరూ సమావేశాలకు నామమాత్రంగానే హాజవుతుండటం, సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా సచిన్ విషయానికి వస్తే ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఇతర వాణిజ్య ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లకు వెళ్లేందుకు దేశ విదేశాలకు వెళుతుంటారు. రోజుల కొద్దీ గడుపుతుంటారు. కానీ, ఢిల్లీలో ఉన్న రాజ్యసభకు వెళ్లేందుకు ఆయనకు సమయం లేదు. అదేవిధంగా నటి రేఖ. బాలీవుడ్, హాలీవుడ్ రంగాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి సైతం క్రమం తప్పకుండా హాజరవుతుంటుంది. కానీ, రాజ్యసభ గడప తొక్కలేరు.
ప్రస్తుతం రాజ్యసభలోని 12 మంది నామినేటెడ్ సభ్యుల్లో అందరికన్నా రేఖ, సచిన్‌ల హాజరే పేలవంగా ఉంది. 2012 ఏప్రిల్‌లో రాజ్యసభ సభ్యత్వం పొందినప్పటి నుంచి 348 రోజులకుగాను రేఖ 18 రోజులు, సచిన్ 23 రోజులు మాత్రమే సభకు వచ్చారు. రేఖ ఏ సమావేశాల్లోనే ఒక్కరోజుకు మించి పాల్గొనలేదు. రాజ్యసభ సభ్యులై దాదాపు ఐదేళ్లవుతున్నా రేఖ, సచిన్ ఒక్క చర్చలోనూ పాల్గొనలేదు. సభలో ఆమె ఒక్క ప్రశ్నా వేయలేదు. సచిన్ 22 ప్రశ్నలు అడిగారు.
పైగా, రేఖతోపాటు ఎగువసభకు నామినేట్ అయిన సభ్యుల్లో ఇప్పటివరకు అందరికన్నా ఆమెకే అత్యధికంగా రూ.65 లక్షలు జీతభత్యాల కింద ప్రభుత్వం చెల్లించింది. సచిన్‌కు రూ.58.8 లక్షలు ఇచ్చారు. అంటే రేఖ, టెండూల్కర్‌లపై వారు హాజరైన రోజులకు సగటున రోజుకు రూ.3.6 లక్షలు, రూ.2.56 లక్షలు చొప్పున ప్రజాధనం వ్యయమైంది. ఈ విషయాలో ఓ ‘ఫ్యాక్ట్‌లీ’ సంస్థ జరిపిన విశ్లేషణలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.