“టాటా”కు దక్కిన కొత్త పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్ బాధ్యతలు

Parliament
శ్రీ| Last Updated: గురువారం, 17 సెప్టెంబరు 2020 (21:44 IST)
పార్లమెంటు కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు 7 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా, ఇందులో 3 సంస్థలను
“కేంద్ర ప్రజా పనుల విభాగం” ( సి.పి.డబ్ల్యు.డి) ఎంపిక ‌ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, షపూర్‌జీ పల్లాంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు తుది దశ బిడ్డింగ్‌కు అర్హత సాధించాయి.

మిగిలిన నాలుగు సంస్థల దరఖాస్తులను “కేంద్ర ప్రజా పనుల విభాగం” తిరస్కరించింది. షార్ట్‌ లిస్ట్‌ అయిన మూడు కంపెనీలు సమర్పించిన “ఫైనాన్షియల్‌ బిడ్స్‌”ను “కేంద్ర ప్రజా పనుల విభాగం”
పరిశీలించింది. మొత్తం నిర్మాణ వ్యయాన్ని రూ. 940 కోట్లుగా కేంద్ర ప్రజా పనుల విభాగం” అంచనా వేసింది. అయితే, “లార్సెన్‌ అండ్‌ టుబ్రో” 865 కోట్ల రూపాయలకు బిడ్ వేయగా, అంతకంటే తక్కువకు 861 కోట్ల 90 లక్షల రూపాయలకే బిడ్ వేసిన “టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్”‌ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.

సత్వరమే నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా ఇతర ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ భవనానికి సరిగ్గా ఎదురుగానే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కానుంది. పార్లమెంట్ భవన సముదాయానికి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటినీ 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పునర్నిర్మాణం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అతి ప్రధాన
పాలనాకేంద్రం గా ఉన్న
ఈ ప్రాంతాన్ని “సెంట్రల్ విస్తా” ప్రాజెక్ట్ గా రూపకల్పన చేయడం జరిగింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, రాజధానిలో పాలనాపరమైన భవనాలను
అధునాతన వసతులతో, సర్వహంగులతో పునర్నిర్మాణం చేయాలన్న బృహత్తర ప్రణాళిక లో భాగంగానే ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతోంది. 2022 నాటికి భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకల్ని జరుపుకోబోతోంది. ఆ సమయానికి కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభల సమావేశాలు జరగుతాయని గత జనవరిలో లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యానించారు.

అయితే, కరోనా వైరస్ కారణంగా దీనికి సంబంధించిన ప్రక్రియ ఆలస్యమైంది. ఢిల్లీ రాజధానిగా పాలన సాగించాలని నిర్ణయించిన నాటి బ్రిటిష్ పాలకులు... ఇక్కడ పరిపాలన భవనం కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. సర్ ఎడ్విన్ లూటిన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిషర్లు ప్రస్తుత పార్లమెంట్ భవనం కు డిజైన్ రూపొందించారు. బ్రిటిష్ పాలనలో 1921 లో ప్రస్తుత పార్లమెంటు భవనం
నిర్మాణం ప్రారంభమై ఆరేళ్ల తర్వాత పూర్తయైంది. ఆ తర్వాత 1956 లో అవసరాల మేరకు సరిపోవడం లేదని మరో రెండు అంతస్తులు నిర్మించారు.

ప్రస్తుత అవసరాలకు పార్లమెంటు భవనం ఏమాత్రం సరిపోవడం లేదని, భవనం ఇరుకుగా ఉందని, అంత క్షేమకరం, సురక్షితం కాదనే
నిపుణుల నివేదిక ను కూడా ఆధారం చేసుకుని,
కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని
మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత
పార్లమెంటు భవనం బాహ్యరూపానికి
అనుగుణంగానే, కొత్త పార్లమెంట్ భవనానికి కూడా రూపకల్పన చేయడం జరిగింది.

ప్రతి ఏడాది పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఉభయ సభలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరుపుతుంది. ఆ కేటాయింపులలోనే ఈ కొత్త భవనాల నిర్మాణానికి లోక సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ బడ్జెట్ కేటాయింపులను ఆమోదించారు. ఒకేసారి కాకుండా, వచ్చే రెండేళ్లపాటు ఉభయ సభలు వాటికి లభించే బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆర్ధిక వనరులను సమకూర్చనున్నాయు. 65 వేల చదరపు మీటర్ల వైశాల్యం గల పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని రూ. 881.90 కోట్లతో “టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్” పూర్తిచేయనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా, రెండతస్తుల కొత్త పార్లమెంట్ భవనం 2022 కల్లా పూర్తి కానుంది.దీనిపై మరింత చదవండి :