అస్సాం: ఆలయాల నిర్మాణానికి సాయం చేస్తున్న ముస్లిం జంట

temple
బిబిసి| Last Updated: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (20:37 IST)
అస్సాంలో హిందూ దేవాలయాల నిర్మాణానికి, మరమ్మతులకు ఆర్థిక సాయం చేస్తూ ఓ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 39 ఏళ్ల హామిదుర్ రహమాన్, ఆయన భార్య పార్సియా సుల్తానాలు అసోంలోని జోర్‌హాట్ జిల్లాలో కొన్ని హిందూ మందిరాల నిర్మాణాలు, మరమ్మతులు చేయించారు. మసీదులకూ కూడా వీరు సాయం చేస్తున్నారు. తమకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా వేయించారు.

‘‘మా నాన్న టీ తోటలో పనిచేసేవారు. అక్కడ మా కుటుంబం తప్ప, అందరూ హిందువులే ఉండేవారు. కానీ, మా కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు ఎప్పుడూ నాకు ఆ తేడా తెలియనివ్వలేదు. టీ తోటలోనే ఓ హరి మందిరం ఉండేది. అక్కడ పౌరాణిక నాటకాలు వేసేవారు. నేను కూడా నా మిత్రులతో కలిసి వాటిలో పాత్రలు వేసేవాడిని. కాలేజీ వయసు వచ్చేదాకా నేను వాటిలో పాల్గొంటూనే ఉన్నా. నేను అన్ని మతాలను గౌరవించడానికి ఇదే కారణం. నా స్తోమత కొద్దీ వీలైన సాయం చేస్తుంటా. మీడియాలో నాపై వార్తాలు రావాలని కాదు, నా మనసుకు సంతోషం కలగాలని ఈ పని చేస్తున్నా’’ అని హామిదుర్ బీబీసీతో చెప్పారు.

అస్సాంలో హిందూ-ముస్లింల విభజనకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు వైకుంఠ్ నాథ్ గోస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘గత కొన్నేళ్లుగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలను పరస్పర వ్యతిరేకులుగా మార్చి ఓట్లు పొందాలని చూస్తున్నారు. కానీ, అసోం ఎగువ ప్రాంతంలో విభజన రాజకీయాలు పనిచేయవు. అక్కడ ఐకమత్యం ఎక్కువ’’ అని అన్నారు.

రోడ్లు కూడా వేయించారు
హామిదుర్ రోజుకు ఐదుసార్లు నమాజ్ చదువుతారు. హిందూ మందిరాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. ఇస్లాంలో విగ్రహాన్ని ఆరాధించేవారిని ‘కాఫిర్లు’గా పరిగణిస్తారు. కానీ, హామిదుర్ ఓ మందిరానికి కాళీ మాత విగ్రహాన్ని, త్రిశూలాన్ని, గంటను కూడా దానం చేశారు.


‘‘నేను నా మత నియమాలను పాటిస్తా. వాళ్లు (హిందువులు) వాళ్ల నియమాల ప్రకారం అన్నీ చేస్తారు. ఇందులో అభ్యంతరకర విషయం ఏముంది? 2013-14 నుంచి నేను ఇలా సాయం చేస్తున్నా. వారి కోసం ఎక్కడికైనా వెళ్తా. ఏదైనా లోటు ఉంటే, దాన్ని తీర్చాలని ప్రయత్నిస్తా’’ అని హామిదుర్ అన్నారు.

జోర్‌హాట్‌‌లోని తితాబర్‌ పట్టణంలో ఓ శివాలయ నిర్మాణానికి కూడా హామిదుర్ సాయం చేశారు. ‘‘2008లో వెదురు, టిన్‌ ఉపయోగించి ఈ ఆలయాన్ని కట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత నిర్మాణం దెబ్బతింది. అప్పట్లో తరుణ్ గోగోయ్ ప్రభుత్వాన్ని కూడా సాయం కోసం మేం అభ్యర్థించాం. కానీ ఫలితం లేకపోయింది.


స్థానికుల సాయంతో పక్కా నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఈ సమయంలోనే హామిదుర్ మాకు ఇటుకలు అందించారు. గేటు చేయంచారు. గంట, త్రిశూలం కూడా అందజేశారు. మా ఆలయం బాగుపడింది. హామిదుర్ కూడా ఎదిగారు’’ అని ఆ ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజెన్ హజారికా అన్నారు.

తితాబర్ హైండిక్ గ్రామంలో ఉన్న మందిరంలో ఒక హాలును, బంగాలీ పట్టీలోని రాధా కృష్ణ హరి మందిర ప్రాంగణంలో టాయిలెట్లను కూడా హామిదుర్ కట్టించారు. రాధా కృష్ణ మందిర సమీపంలో రోడ్డును కూడా ఆయనే వేయించారని శివాలయ కమిటీ అధ్యక్షుడు నికు మాలాకార్ చెప్పారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి హామిదుర్ సాయం చేస్తుండటాన్ని స్థానిక ముస్లింలు కూడా అభినందిస్తున్నారు. ఆయన మసీదుల కోసం కూడా సాయం చేశారు.

‘‘మా మాసీదు నిర్మాణం, సుందరీకరణకు హామిదుర్ దాదాపు రూ.12 లక్షలు దానం చేశారు. ఆ తర్వాత వేరే మతాల మందిరాలకు కూడా ఆయన సాయం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. తితాబర్‌లో ఎప్పుడూ సామరస్య వాతావరణం ఉంది. ఇప్పటివరకూ మతపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు’’ అని బోకాహోలా జమా మసీదు నిర్మాణ సమితి కార్యదర్శి అబ్దుల్ రవుఫ్ అహ్మద్ అన్నారు.

తితాబర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తరుణ్ గొగోయ్ వరుసగా 15 ఏళ్లు అసోంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడూ ఈ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. తితాబర్ పట్టణంలోని శాహ్ ఆలమ్ రోడ్డుకు హామిదుర్ మరమ్మతులు చేయించారు.


‘‘వర్షాకాలంలో ఈ రోడ్డు నీళ్లతో నిండిపోయేది. రాత్రి పూట ఈ దారి నుంచి వెళ్లే ధైర్యం కూడా జనాలు చేసేవారు కాదు. ఈ విషయాన్ని గ్రామస్థులు హామిదుర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దగ్గరుండి రోడ్డును బాగు చేయించారు. నీళ్లు పోవడానికి కాలువలు తవ్వించారు. ఈ రోడ్డుపై ఇప్పుడు వాహనాలు బాగా తిరుగుతున్నాయి’’ అని స్థానికుడు బుబుల్ హుస్సేన్ అన్నారు.

హామిదుర్‌కు జోర్‌హాట్‌లోని చినామార్‌లో ఉక్కు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, గత కొన్నేళ్లలోనే వ్యాపారంలో బాగా ఎదిగారని స్థానికులు చెబుతారు. ‘‘జనాలకు సాయం చేయడం కన్నా మంచి పని ఏముంటుంది. మా మొత్తం కుటుంబం ఆయన వెంట ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి’’ అని హామిదుర్ భార్య సుల్తానా అంటున్నారు.


‘‘మతంతో సంబంధం లేకుండా జనాలు ఒకరికొకరు సాయం చేసుకునేలా సమాజం ఉండాలని... నేను, నా ఇద్దరు కుమార్తెలు కోరుకుంటున్నాం. నా భర్తతోపాటు నేను కూడా ఆలయాలకు వెళ్తుంటా. ప్రార్థన చేస్తా. ఇప్పటివరకూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మా కుటుంబంలో ఒక కోడలు హిందూ మతానికి చెందినవారే. మేమంతా కలిసిమెలిసి ఉంటాం’’ అని ఆమె చెప్పారు.

దీనిపై మరింత చదవండి :