గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:45 IST)

ప్రపంచ దేశాలు 'అయ్యో భారత్' అంటుంటే ఇక్కడ IPL అవసరమా?

ఐపీఎల్... ఇప్పుడసలు ఎవరి కోసం ఆడాలి? ఒకవైపు కరోనా సోకి రోజూ 3 లక్షల మందికి పైగా రోగులవుతున్నారు. మరోవైపు దాదాపు ప్రతిరోజూ రెండున్నర వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మహమ్మారి దేశంలో 10 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల ప్రజానీకం సైతం కరోనా తాకిడికి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
 
తాజాగా కేంద్రం చేసిన ప్రకటన సారాంశం ప్రకారం ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాల్సిన స్థితి. ఇలాంటి స్థితిలోనూ, రాత్రిపూట కర్ఫ్యూలు సాగుతున్న వేళల్లోనూ దేశంలో ఐపీఎల్ ఆట నిర్విరామంగా సాగటం సమంజసమేనా? ఒకవైపు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇక్కడి కరోనా కేసుల స్థితిని చూసి 'అయ్యో భారత్' అంటున్నాయి. తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో ఆడుతున్న విదేశీ ఆటగాడు కమిన్స్ సైతం తన గుండె బరువెక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. తన వంతు సాయంగా భారతదేశానికి 50 వేల డాలర్ల విరాళం ప్రకటించారు.
ఇంత మంచివాళ్లకు ఎంత కష్టం
"అనేక సంవత్సరాలుగా భారత్ రావడాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక్కడివాళ్లు ఎంతో సహృదయులు. ఇంత మంచివాళ్లను నేనెప్పుడూ చూడలేదు. కానీ వీళ్లు ప్రస్తుతం అనుభవిస్తున్న వేదన చూసిన తర్వాత నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అయితే భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కొనసాగించడం సమంజసమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే.... కఠిన లాక్డౌన్ తరహా ఆంక్షల నడుమ ప్రజలకు ఐపీఎల్ కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తుందన్న కోణంలో భారత ప్రభుత్వం ఆలోచిస్తుందని భావిస్తున్నాను.
 
ఇక ఆటగాళ్లుగా మేం ఐపీఎల్ ద్వారా కోట్లాది మందికి చేరువ అవుతున్నాం. ఈ ప్రజాదరణను మేం మంచిపనుల దిశగానూ ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచనతోనే పీఎం కేర్స్ ఫండ్‌కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా, దేశంలో ఆక్సిజన్ సరఫరా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నా విరాళాన్ని ఆ దిశగా ఉపయోగించాలని కోరుకుంటున్నా. భారత్ తపన, ఔదార్యం పట్ల ప్రభావితులైన ఐపీఎల్‌లోని ఇతర ఆటగాళ్లు, ఇతరులు కూడా విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నా.
కరోనాతో కన్నుమూసినవారి పట్ల ఎంతో బాధపడుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోతున్న వారి పట్ల వ్యక్తమయ్యే భావోద్వేగాలను కార్యరూపం దాల్చేలా చేసి, బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి. నేనిస్తున్న విరాళం ఏమంత పెద్దది కాదని తెలుసు కానీ, అది ఏ కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను' అని కమిన్స్ భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు.
 
ఆటగాళ్లు వైదొలిగినా ఐపీఎల్ ఆగదు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 14వ సీజన్ పోటీల్లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు చాలా ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి చేయిదాటిపోయింది. దీంతో కుప్పలుతెప్పలుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. 
 
ఒకవైపు, కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న తరుణంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమ కుటుంబీకులు కరోనా బారిన పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది.
 
ఇప్పటివరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే... అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు యాధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. 
 
భారత కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తారాస్థాయిలోనేవుంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది.