సోమవారం, 22 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (15:31 IST)

ఏమిటీ H-1B Visa? కొత్త నిబంధనపై ట్రంప్ గూబ గుయ్, ఇండియన్ టెక్కీలు దెబ్బకి ట్రంప్ యూటర్న్

Donald trump on H1B Visa
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదోవిధంగా భారతీయులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. కొత్తగా ట్రంప్ తీసుకువచ్చిన H-1B Visaపై నిబంధన కూడా అలాంటిదేనంటున్నారు. ఈ వీసా కావాలంటే ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్ నిర్ణయించడంతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. విదేశాలలో వున్న తమ టెక్కీలను తక్షణమే తిరుగు ప్రయాణం కావాలని అమెరికాలోని టెక్ కంపెనీలు మెయిల్స్ పంపాయి.

మరోవైపు.. భారతదేశం నుంచి అమెరికా వెళ్లేందుకు నిర్ణయించుకున్నవారంతా అప్పటికప్పుడు ఎక్కిన విమానాలు దిగిపోతున్నారు. దీనితో అమెరికాకు వచ్చే విదేశీద్రవ్యంపై భారీ దెబ్బ పడుతుందంటూ అక్కడి నిపుణులు ట్రంప్ ను హెచ్చరించినట్లు సమాచారం. దానితో ట్రంప్ తన నాలుకను ఎప్పట్లాగే తిప్పేసారు. వీసా ఫీజు ఏడాదికి ఒకసారి కాదనీ, అది వన్ టైం ఫీజు అంటూ వెల్లడించారు. ఐనప్పటికీ ఇకపై అమెరికా వెళ్లేవారు కాస్త చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు అయితే వచ్చేసినట్లు కనబడుతోంది.
 
ఏమిటీ H-1B Visa?
హెచ్-1బి వీసా అనేది అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అక్కడి కంపెనీలకు అనుమతి ఇచ్చే ఒక వీసా. దీన్ని పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా, ఈ వీసాను పొందడానికి కింది ముఖ్యమైన నియమాలు వర్తిస్తాయి:
 
అర్హత: అభ్యర్థికి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన ఉన్నత విద్యార్హత ఉండాలి. అతను దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగం ఒక స్పెషాలిటీ ఆక్యుపేషన్ అయి ఉండాలి, అంటే ఆ పనికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం.
 
ఉద్యోగ ఆఫర్: అమెరికాలోని ఒక కంపెనీ నుండి మీకు ఒక ఉద్యోగ ఆఫర్ ఉండాలి. ఆ కంపెనీ మీకు స్పాన్సర్ చేయాలి. ఉద్యోగి సొంతంగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు.
 
ప్రీవైలింగ్ వేజ్: హెచ్-1బి వీసా పొందిన ఉద్యోగులకు, అమెరికాలోని అదే స్థాయిలో, అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర కార్మికులకు చెల్లించే జీతానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ జీతం చెల్లించాలని యజమాని హామీ ఇవ్వాలి.
 
వార్షిక పరిమితి: ప్రతి సంవత్సరం జారీ చేసే హెచ్-1బి వీసాల సంఖ్యపై పరిమితి ఉంటుంది. ప్రస్తుతం, సాధారణ కోటా కింద 65,000 వీసాలు, అలాగే అమెరికాలోని మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నవారికి అదనంగా 20,000 వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిమితి కారణంగా లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
కాలపరిమితి: ఈ వీసా సాధారణంగా గరిష్ఠంగా ఆరు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ప్రారంభమైతే, ఆరు సంవత్సరాల తర్వాత కూడా వీసా పొడిగింపును కోరవచ్చు.
 
ఇటీవల వచ్చిన కొత్త నిబంధనలు
అమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్-1బి వీసా నిబంధనలలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువచ్చింది. దీని ప్రకారం, అమెరికా వెలుపల ఉన్న కొత్త హెచ్-1బి వీసా అభ్యర్థులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో పిటిషన్‌కు $100,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుముతో పాటు, కొన్ని సందర్భాల్లో అమెరికాలోకి ప్రవేశించడానికి కొన్ని పరిమితులు ఉండవచ్చు.
 
అయితే, ఈ కొత్త నిబంధనపై ప్రస్తుతం పూర్తి స్పష్టత లేదు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ చేసిన ప్రకటనల ప్రకారం, ఈ రుసుము ప్రస్తుత వీసా హోల్డర్లకు లేదా రెన్యువల్ చేసుకునే వారికి వర్తించదు అని స్పష్టం చేశారు. ఈ మార్పు కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీనిపై ఇంకా పలు రకాల అభిప్రాయాలు, చట్టపరమైన సవాళ్లు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.