బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:53 IST)

టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి కోపం వచ్చింది, ఎందుకంటే?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా టికెట్ల జారీలో విఐపిల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో జరిపిన చర్చను వక్రీకరించి కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుండటం దౌర్భాగ్యమని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒకప్రకటన విడుదల చేశారు.

 
పాలక మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే అభిప్రాయం తోనే ఎస్వీబీసీలో లైవ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా తాము ఈ అంశం చర్చించలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకుల చెవులకు వినిపించక పోవడం తమ తప్పుకాదని శ్రీ సుబ్బారెడ్డి అన్నారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా తాను ఈ విషయం చాలా సూటిగా, స్పష్టంగా ఒకటికి రెండుసార్లు చెప్పిన వీడియో రాజకీయ ఆరోపణలు చేసే వారి కళ్ళకు కనిపించక పోవడం పాలక మండలి తప్పు కాదన్నారు.

 
సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల్లో ఆందోళన రేపే ప్రయత్నాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సఫలం కానివ్వరనే విషయం వారు గుర్తించాలని శ్రీ సుబ్బారెడ్డి హితవుపలికారు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్ర దారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారన్నారు. ఇప్పటికే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్న వారు ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని సూచించారు. 

 
తమ పాలక మండలి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు మేలు చేసే సద్విమర్శలని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజల్లో అభిప్రాయం కల్పించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని ఆయన కోరారు. తాను, సభ్యులు పాలక మండలి సమావేశంలో మాట్లాడిన మాటలను సాంకేతిక పరిజ్ఞానంతో వారికి కావాల్సిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

 
ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై చాలాకాలంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. సేవాటికెట్లు ప‌రిమితంగా ఉండ‌గా, సిఫార‌సు లేఖ‌లు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. సిఫార‌సుల‌ను త‌గ్గించేందుకు విచ‌క్ష‌ణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే ఎలా ఉంటుంద‌నే విష‌యంపై చ‌ర్చ మాత్ర‌మే జ‌రిగింద‌ని, ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని వివ‌రించారు. సామాన్యుల‌కు కేటాయించే ఆర్జిత సేవాటికెట్ల ధ‌ర‌ల పెంచాలనే ఆలోచనే తమకులేదన్నారు. విఐపిల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

 
రెండున్న‌రేళ్ల నుండి టిటిడి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. విమర్శకులకు ఇవేవీ కనిపించలేదా అని శ్రీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించామ‌న్నారు. రెండో విడతగా దాదాపు 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని పనులు  జరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. 

 
జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకోలేని పేదవర్గాల వారిని ఆహ్వానించి ఉచితంగా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామ‌న్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2021 అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు దాదాపు 7500 మందికి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌న భాగ్యం కల్పించామని చైర్మన్ వివరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 20వతేదీ వరకు దాదాపు 7 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామ‌ని తెలిపారు.  

 
శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు భక్తులతో శ్రీ వేంకటేశ్వర నామకోటి రాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ‌న్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించామ‌ని, భువనేశ్వర్‌, చెన్నై, ఊలందూర్‌పేట, సీతంపేట, అమరావతి, రంపచోడవరంలో ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయ‌ని తెలియ‌జేశారు. విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో ప్రారంభిస్తామ‌న్నారు.

 
ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆదేశంతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌ని, ఇప్పటివరకు ప‌లు ఆలయాలకు ఆవులు, దూడలు అందించామ‌ని తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులు గోమాతను దర్శించుకున్నాకే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత శ్రీవేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం ప్రారంభించామ‌న్నారు.

 
టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో గతేడాది అక్టోబరు 30, 31వ తేదీల్లో జాతీయ గోమహాసమ్మేళనం నిర్వహించామన్నారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాధిపతులు, గోసంరక్షణశాలల నిర్వాహకులు, గోప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరయ్యారని ఆయన చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మేళనం తీర్మానం చేయడం హిందూ ధర్మ వ్యతిరేక చర్యా? అని నిలదీశారు.

 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీకపిలేశ్వరాలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని ఆయన తెలిపారు. భక్తులు ఈ ఆలయాల్లో గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా, టిటిడి అనుబంధ ఆలయాల్లో వేదాశీర్వచనం ప్రారంభించామని తెలిపారు.

 
ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంత‌రంగా పారాయణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల యువతలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయా మాసాలకు సంబంధించిన విశేష కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేస్తున్నామ‌ని వివ‌రించారు.

 
విరాట‌ప‌ర్వం, ఆదిప‌ర్వం లాంటి విశేష కార్య‌క్ర‌మాల‌ను మొద‌టిసారిగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, తద్వారా కోట్లాది మంది భ‌క్తులు ప‌ర‌వ‌శించిపోయార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో భ‌క్తిత‌త్వాన్ని పెంపొందించేందుకు, హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించేందుకు ఎస్వీబీసీ హిందీ, క‌న్న‌డ ఛాన‌ళ్ల‌ను 2021, అక్టోబ‌రు 11న ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఎస్వీబీసీలో నాలుగు భాష‌ల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి సేవ‌లు, ఉత్స‌వాలు, విశేష కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

 
ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు 2021, అక్టోబరు 11న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంను ప్రారంభించామని ఆయన వివరించారు. పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటివరకు 100 శస్త్రచికిత్సలు జరిగాయనీ, వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు కాగా మిగతావి క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా చేశారని ఆయన చెప్పారు. మరో అడుగు ముందుకేసి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థలసేకరణ పూర్తి చేశామని, ఇందుకు సంబంధించిన డిపిఆర్, డిజైన్లు ఖరారు చేశామని చైర్మన్ చెప్పారు.

 
మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్‌ ఆసుపత్రిలో తగిన వైద్యం, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి కట్టుబడి ఉన్నామని, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేసే వారి విమర్శలకు భయపడి ఈ కార్యక్రమాల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.