మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (11:23 IST)

తిరుమ‌లేశుడు, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌తో టిటిడి ప్ర‌త్యేక క్యాలెండ‌ర్‌

శ్రీ‌వారు, అమ్మ‌వార్ల చిత్రాల‌కు 3డి ఎఫెక్ట్‌, సిల్వ‌ర్ కోటింగ్‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండ‌ర్‌ను టిటిడి ధర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

 
ఛైర్మ‌న్ మాట్లాడుతూ వైవి.సుబ్బారెడ్డి స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన, తాకిన‌ అనుభూతి క‌లిగేలా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఈ క్యాలెండ‌ర్ల‌ను ముద్రించిన‌ట్టు చెప్పారు. ఒక్కో పేజీలో రెండు నెల‌లకు సంబంధించిన వివ‌రాలు ఉండేలా రూపొందించార‌ని, హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి ప్రింట‌ర్స్ సంస్థ వీటిని ముద్రించింద‌ని తెలిపారు. మొత్తం 25 వేల కాపీలు ముద్రించామ‌ని, ఒక్కో క్యాలెండ‌ర్ ధ‌ర రూ.450/- అని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌, తిరుప‌తితోపాటు విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీలో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచామ‌న్నారు.

 
ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఆడిట్ ఆఫీస‌ర్ శేష‌శైలేంద్ర‌, హెల్త్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ శ్వేత‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం టిటిడి కార్పొరేష‌న్‌లో చేరిన ఉద్యోగుల గుర్తింపుకార్డుల‌ను కార్పొరేషన్ సిఈవో శేష‌శైలేంద్ర ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి చూపించారు. ఇటీవ‌ల 1000 మందికిపైగా కార్పొరేష‌న్‌లో చేరారని, వీరికి క‌ల్పించే స‌దుపాయాల గురించి ఆయ‌న ఛైర్మ‌న్‌కు వివ‌రించారు.