కన్నీళ్ళు పెట్టుకుంటున్న టిటిడి పాలకమండలి సభ్యులు, ఏమైంది?
టిటిడి పాలకమండలి పదవి మరో నెల రోజుల్లో ముగియబోతోంది. రెండేళ్ళ క్రితం బాధ్యతలు స్వీకరిస్తే కరోనా కారణంగా పదవిని అనుభవించకుండానే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాలకమండలి సభ్యులు ఆలోచనలో పడ్డారు. మళ్ళీ సభ్యులుగా వీరికే అవకాశం రావడం మాత్రం అనుమానమే.
కలియుగ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏ చిన్న పదవి అయినా అదృష్టంగా భావిస్తారు. టిటిడి పరిపాలన పర్యవేక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన టిటిడి పాలకమండలికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ పాలకమండలి కాలపరిమితి రెండేళ్ళు.
పాలకమండలిలో పదవి కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రాజకీయ నాయకులే కాదు మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా తమ అనుచరులకు పాలకమండలిలో సభ్యునిగా ఇవ్వాలని సిఫార్సు చేస్తుంటారు. గతంలో 18 మంది సభ్యులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 36కి చేరింది.
సాధారణంగా ఎపి, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకకు మాత్రమే సభ్యత్వం. ఈసారి మాత్రం ఢిల్లీ వరకు విస్తరించింది. పాలకమండలి ఏర్పాటైతే జరిగింది కానీ కరోనా కారణంగా పదవిని అనుభవించే భాగ్యం మాత్రం లభించలేదు. 2019 జూన్ 21న టిటిడి ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి నియమితులయ్యారు. సెప్టెంబర్ 22న పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. కరోనా ఎఫెక్ట్ పడింది. గత యేడాది మార్చి 20వ తేదీ నుంచి దర్సనాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాలకమండలి సమావేశం జరిగిన దాఖలాలు లేవు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని ఏప్రిల్ 14వ తేదీన పాలకమండలి నిర్ణయించింది.
కానీ అప్పటి నుంచి సెకండ్ వేవ్ వల్ల దర్సనాలను మళ్ళీ తగ్గించారు. తరువాత సమావేశం జరుగలేదు. ఈలోపే టిటిడి నిబంధనల ప్రకారం వచ్చే నెల 21 నాటికి బోర్డు కాలపరిమితి ముగియనుంది. ఈ సమయంలో మరోసారి పాలకమండలి సమావేశం జరగడం అనుమానంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాలు తొమ్మిది మాత్రమే. కేవలం ఐదు నెలలు మినహాయిస్తే కరోనా పుణ్యనా మిగిలిన కాలం మొత్తం కరిగిపోయింది.
పదవి అనుభవించకుండా ఇలా జరిగిందేంటి స్వామి అంటూ అంతా లోలోపలే బాధపడిపోతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. వీరికి మరోసారి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. కానీ ఇప్పటికే సిఎం ప్రకటించినట్లుగా ఒకసారి పదవిని పొందిన వారికి మరోసారి అవకాశం ఉండదని తేల్చిచెప్పేశారు.