దినకరన్ చేష్టలు భరించలేం... పన్నీర్ వర్గంలోకి దూకుదాం... అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అంతర్మథనం!
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ చేష్టలు ఆ పార్టీ నేతలతో పాటు మంత్రులకు పిచ్చెక్కిస్తున్నాయి. అతని వేధింపులను భరించలేక విసిగిపోత
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ చేష్టలు ఆ పార్టీ నేతలతో పాటు మంత్రులకు పిచ్చెక్కిస్తున్నాయి. అతని వేధింపులను భరించలేక విసిగిపోతున్నారు. కొందరైతే తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం వైపు జారుకునేందుకు తట్టాబుట్టా సర్దుకుంటున్నట్టు సమాచారం.
దీనికి ప్రధాన కారణం ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేయడమే కాకుండా, ఆ డబ్బు పంపిణీలో ఏకంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు.. ఏడుగురు మంత్రులను భాగస్వాములను చేయడమే. ఈ డబ్బు పంపిణీ సీఎంతో పాటు.. మంత్రుల మెడకు ఉచ్చులా మారనుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడున్నారు. ఇప్పటికే, ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విజయభాస్కర్‌కు ఐటీ శాఖ ఉచ్చుబిగించింది. ఈయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో మిగిలిన మంత్రులు బెంబేలెత్తిపోతున్నారు.
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామాలు నెలకొన్న విషయం తెల్సిందే. పార్టీని తన గుప్పెట్లోకి తీసుకున్న శశికళ... చివరి నిమిషం వరకు ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతో కష్టపడింది. చివరకు ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లారు. ఆమె వెళుతూ వెళుతూ తన స్థానంలో మేనల్లుడు టిటివి దినకరన్‌ను నియమించారు.
ఈయన పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని కన్నేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఏదోవిధంగా గెలుపొందాలని ప్రయత్నించారు. ఇందుకోసం భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఈ వ్యవహారం బయట పడడంతో... ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టు అయ్యింది.
ఆ డబ్బు పంపిణీ కార్యక్రమంలో స్వయానా ముఖ్యమంత్రి భాగస్వామిగా ఉండటంతో ప్రభుత్వానికి ఎసరు తెచ్చినట్టయ్యింది. ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేర నగదు, బహుమతులు ఇచ్చినట్టు ఐటీ దాడుల్లో సాక్ష్యాలు లభించాయి. ఆ మొత్రం ప్రక్రియలో ముఖ్యమంత్రి, ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ పాత్ర పోషించినట్టు సాక్ష్యాలు దొరికాయి. వీరందరినీ కూడా ఐటీ అధికారులు విచారించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వద్ద ముమ్మరంగా విచారణ జరుగుతోంది.
ఈ పరిణామాలతో హడలిపోయిన అన్నాడీఎంకే నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అన్నాడీఎంకేలో ఉంటూ నిత్యం లేనిపోని సమస్యలు ఎదుర్కొనే బదులు.. ప్రత్యర్థి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయి మనశ్సాంతిగా జీవించవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి వారంతా ఇప్పటికే పన్నీర్ వర్గం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.