1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2015 (12:23 IST)

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి పదవీ గండం.. ఎందుకో తెలుసా?

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడుకి పదవీగండం తప్పేలా లేదు. అయితే, కమలనాథులు ప్రత్యేక దృష్టిసారిస్తే మాత్రం వెంకయ్య కేంద్ర మంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఆయన మంత్రిపదవి నుంచి తప్పుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. దీనివెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే... 
 
ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అనేక కీలక నిర్ణయాలు చేసింది. అధికార పదవుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని పార్టీ అంతర్గత సమావేశంలో నిర్ణయించింది. అందులో భాగంగానే ఒక వ్యక్తికి మూడు విడతలకు మించి రాజ్యసభకు అవకాశం ఇవ్వరాదన్న 'సూత్రప్రాయ నిర్ణయం' కూడా జరిగినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఇదే నిజమైతే ప్రస్తుతం భాజపా తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ ప్రధాని మోడీ మంత్రిమండలిలో కొనసాగుతున్న వారిలో అరుణ్‌ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు వంటి నేతల విషయం చర్చనీయాంశంగా మారింది. వీరిలో రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీల రాజ్యసభ పదవీ కాలం 2018లో ముగుస్తుంది. కానీ, వెంకయ్య నాయుడు రాజ్యసభ పదవీ కాలం వచ్చే జూన్ నెలతో ముగియనుంది. ప్రస్తుతం ఈయన కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ తాజా 'సూత్రప్రాయ నిర్ణయం'తో వెంకయ్యనాయుడు పదవి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సేవలను ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న అంశం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఒకవేళ మరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కకపోతే మాత్రం వెంకయ్య నాయుడు ప్రస్తుతం అనుభవిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.