ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:38 IST)

తాటికల్లు, లీజు ఇళ్లపై జీఎస్టీ... ప్రజల నెత్తిన పెనుభారం..

జీఎస్టీ చాటున ప్రజలపై కేంద్రం పెనుభారం మోపనుంది. జీఎస్టీని సరళతరం చేస్తున్నామంటూ సుతిమెత్తని మాటలు చెబుతున్న కేంద్రం.. ఆచరణలో మాత్రం మరోలా నడుచుకుంటోంది. ఫలితంగా ప్రజల నెత్తిన పెనుభారం మోపనుంది. 
 
ఒకేసారి పన్ను శ్లాబుల మార్పు నుంచి, కొత్తగా పలు వస్తు సేవలను జీఎస్టీ పరిధిలోకి తేవడం వరకు ఎడా పెడా బాదుడుకు సిద్ధమవుతోంది. కేంద్రం తలపెడుతున్న భారీ మార్పుల ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయల మేర భారీ ఆదాయం సమకూర్చుకోవడంపై గురి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. 
 
దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు. వచ్చే వారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో కీలక మార్పులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందన్నది సమాచారం. ఆ వర్గాలు తెలిపిన ప్రకారం చూస్తే.. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న బేస్‌ శ్లాబ్‌ను 9-10 శాతానికి పెంచడం, 12 శాతం శ్లాబ్‌ను పూర్తిగా తొలగించి, ఈ శ్లాబులోని 243 వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకురావడం వంటి ప్రతిపాదనలు కీలకమైన ప్రభావం చూపే అంశాలు.
 
ప్రస్తుతం పలు వస్తు సేవలకు పన్ను మినహాయింపు ఉంది. ఇప్పుడు వాటిలో పలు వస్తు సేవలను కొత్తగా పన్ను పరిధిలోకి చేర్చనున్నారు. ఈ జాబితాలోకి తొలిసారి తాటి కల్లును కూడా చేర్చనుండటం విశేషం. వైద్య ఖర్చులు, రూ.1000లోపు ఉండే హోటల్‌ గదులు, కంపెనీలు లీజుకు తీసుకున్న ఇళ్లు వంటివి ఈసారి జాబితాలో చేరనున్నాయని తెలుస్తోంది. 
 
అదేసమయంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పంపిణీపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్న నేపథ్యంలో దీనిపైనా సమావేశంలో చర్చించనున్నారు. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయం తగ్గిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పన్ను రేటు 14.4 శాతం నుంచి 11.6 శాతానికి పడిపోవడంతో ఆదాయం రూ.2 లక్షల కోట్ల మేర తగ్గిందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో ఈ అంశంపై చర్చించనున్నారు. ముఖ్యంగా, తక్కువ శ్లాబులో ఉన్న పలు వస్తువులపై పన్ను భారం పెంచనున్నారని సమాచారం. 
 
ఐదు శాతం శ్లాబు నుంచి పెంపు..: 
నాణ్యమైన తృణ ధాన్యాలు, పిండి, పన్నీర్‌, విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణాలు, ఏసీ రైళ్లలోని 1, 2 తరగతుల్లో ప్రయాణాలు, పామ్‌, ఆలివ్‌ ఆయిల్‌, పిజ్జా, కోకోపేస్ట్‌, డ్రైఫ్రూట్స్‌, పట్టు, పురుషులు వాడే లినెన్‌ దుస్తులు, పర్యాటక బోట్లలో ప్రయాణాలు, టూర్‌ సర్వీసులు, ఔట్‌డోర్‌ కేటరింగ్‌, రెస్టారెంట్స్‌.
 
12 శాతం శ్లాబు నుంచి 18 శాతానికి... 
మొబైల్‌ ఫోన్లు, విమానప్రయాణాలు, రాష్ట్రాలు నిర్వహించే లాటరీలు, ఖరీదైన పెయింటింగ్స్‌, రూ.5000-7500 మధ్య ఉన్న హోటల్‌ గదులు. 
 
కొత్తగా జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి...
ఖరీదైన ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్‌కేర్‌ ఖర్చు, రూ.1000 లోపు ఉండే హోటల్‌ గదులు, అన్‌ బ్రాండెడ్‌ పన్నీర్‌, ముడి పట్టు, కంపెనీలు లీజుకు తీసుకునే ఇళ్లు, తాటి కల్లు.