శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 29 జులై 2017 (07:09 IST)

ఆరోగ్య ప్రదాయిని మొక్కజొన్న.. అయినా పట్టించుకోం. జంక్ రాయుళ్లం కదా!

ప్రతి రోజూ మనం తినే జంక్ ఫుడ్ అనే చెత్త తిండికి అలవాటుపడిపోయి సంజీవనిలాగా మనకు పూర్వకాలం నుంచి ఉపయోగపడుతున్న అద్భుతమైన దేశీయ ఆహారాన్ని చేతులారా వదిలేశాం. మన ముంగిట్లో దొరికే మూడు పదార్థాలను ఇప్పుడు ఆహారంలో భాగంగా స్వీకరించాలంటే నామోషి. అవేమిటంటే మొక్

ప్రతి రోజూ మనం తినే జంక్ ఫుడ్ అనే చెత్త తిండికి అలవాటుపడిపోయి సంజీవనిలాగా మనకు పూర్వకాలం నుంచి ఉపయోగపడుతున్న అద్భుతమైన దేశీయ ఆహారాన్ని చేతులారా వదిలేశాం. మన ముంగిట్లో దొరికే మూడు పదార్థాలను ఇప్పుడు ఆహారంలో భాగంగా స్వీకరించాలంటే నామోషి. అవేమిటంటే మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి. వారంవారీ ఆహారంలో భాగంగా ఈ మూడు పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం ఆమడ దూరం  పోతుంది. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీలు ఎక్కువ అనే సాకు చెప్పి మనం వీటిని వదిలేస్తున్నాం. ఆరోగ్యకరమైన కోలెస్ట్రాల్‌ని శరీరం కలిగి ఉండాలి అనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మొక్క జొన్న లోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానన శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చాటిచెబుతున్నారు.
 
మొక్కజొన్న పొత్తును మనం దోవన పోతుంటే పొత్తులను వేసుకుని బండి వాడు వస్తే తీసుకుని ఏదో సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకూ ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోషభావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. మొక్కజొన్నలో ఆరోగ్యానికి మేలు చేసే మరిన్ని అంశాలను చూద్దాం
 
మొక్కజొన్నలో బీటా–కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్‌–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుంది. విటమిన్‌–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే.
 
మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది.
 
మొక్కజొన్నలో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి.ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్‌ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ.
 
అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉండే మొక్కజొన్ననూ వదలొద్దు. మన వేరుశనగనూ వదలొద్దు. కొబ్బరిని అసలు వదలొద్దు. ఈ మూడూ భారతీయులకు తరతరాలుగా శక్తినిచ్చిన అమృత పదార్థాలు.. వీటిని వదలొద్దు.