శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:50 IST)

ఆరోగ్యకర జీవితానికి విటమిన్ల ఆవశ్యకత

మనం ఏదైనా పనిచేయాలంటే శక్తి అవసరం. ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి దాని నుంచి మనకు శక్తి అందుతుంది. కానీ శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా సాగాలంటే కేవలం శక్తి సరిపోదు దానికి మరెన్నో ముఖ్యమైన పదార్థాలు కావాలి. వాటిలో అతి ముఖ్యమైనవి విటమిన్లు.
 
సాధారణంగా మనం తినే ఆహారం ద్వారానే మనకు విటమిన్లు అందుతాయి. అలా అందే విటమిన్లు సరిపోని పక్షంలోగానీ, అత్యవసర పరిస్థితుల్లోగానీ విటమిన్లను మాత్రల రూపంలో శరీరానికి అందించవచ్చు. కానీ ఇలా మాత్రల రూపంలో అందించడంపై శాస్త్రవేత్తలు, వైద్యుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.

అంతేగాకుండా కొన్ని విటమిన్లను నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మోతాదు ఎక్కువైన పక్షంలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందువల్ల కచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ మాత్రలను తీసుకోవాలి. అసలు ఈ విటమిన్లు ఏమిటి, అవి లోపిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు, విటమిన్లు ఎక్కువగా లభించే ఆహారం ఏమిటో తెలుసుకుందాం..
 
"విటమిన్లలో ఏడు రకాలు"
ఏ, బీ, సీ, డీ, ఇ, కె రకాలుగా విటమిన్లు ఉంటాయి. వీటిని రెండు విధాలుగా వర్గీకరిస్తారు. నీటిలో కరగనివి ఏ, డీ, ఈ, కె విటమిన్లు.. ఇవి కొవ్వు పదార్థాలలో కరుగుతాయి. 
 
బీ, సీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. నీటిలో కరగని విటమిన్లు మన శరీరానికి స్వల్ప మోతాదుల్లో అవసరం. కానీ అత్యావశ్యకం. ఇవి కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనే లభిస్థాయి. అదే నీటిలో కరిగే విటమిన్లు మనకు చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి.

కానీ మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇవి కూడా లోపిస్తున్నాయి. ఏ, డి, ఇ, కె విటమిన్లు ఆహార పదార్థాలను వేడి చేసినా దెబ్బతినవు. కానీ బీ, సి విటమిన్లు మాత్రం ఓ స్థాయికి మించి ఆహార పదార్థాలను వేడిచేస్తే నశించిపోతాయి. అందువల్ల విస్తృతంగా లభించినా కూడా బి, సి విటమిన్ల లోపాలు ఏర్పడుతుంటాయి.
 
మంచి కంటి చూపునకు
విటమిన్ -ఏ మంచి కంటి చూపు, నిగనిగలాడే చర్మం, కండరాల పటుత్వానికి విటమిన్ -ఏ తోడ్పడుతుంది. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ ను నియంత్రించే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పిల్లల్లో మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది..శరీరంలో కణాలు దెబ్బతినడాన్ని నిరోధిస్తుంది. రక్తనాళాలు, వివిధ అవయవాలపై పొరల్లో ఉండే కణజాలం రక్షణకు తోడ్పడుతుంది. దంతాలు, రోగ నిరోధక వ్యవస్థ, వివిధ అవయవాలను ఆవరించి ఉండే మ్యూకస్ పొరలు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఏ లో 80 నుంచి 90 శాతం కాలేయంలోనే నిల్వ ఉంటుంది.
 
విటమిన్ -ఏ పనితీరుపై అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రొవిడెన్స్ సెయింట్ జాన్స్ హెల్త్ సెంటర్ వైద్య శాస్త్రవేత్త షెర్రీ రాస్ పరిశోధన చేశారు. శరీరంలో కణాల విభజన, పెరుగుదలతోపాటు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి విటమిన్ -ఏ తోడ్పడుతుందని చెప్పారు. ఇది పెద్దవారిలో పురుషులకు రోజుకు 900 మైక్రోగ్రాములు, మహిళలకు 700 మైక్రోగ్రాములు అవసరం. వరిలో విటమిన్ -ఏ అతి తక్కువగా ఉంటుంది. అందువల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే మన దేశంతోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాల వారిలో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) గణాంకాల ప్రకారం విటమిన్ -ఏ లోపం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది చిన్నారులు అంధత్వం బారిన పడుతున్నారు. చూపు కోల్పోయిన 12 నెలల్లోపే వారిలో సగం మంది వరకూ మరణిస్తున్నారు. రక్తంలోని సీరంలో ఉండే రెటినాల్ స్థాయులను పరీక్షించడం ద్వారా విటమిన్ ఏ లోపాన్ని గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తుల రక్తంలో 28 నుంచి 86 మైక్రోగ్రాములు విటమిన్ -ఏ ఉండాలి. 28 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉంటే లోపమున్నట్లే.

అయితే ఈ లోపాన్ని గుర్తించేనాటికి చాలా ముందు నుంచే విటమిన్ -ఏ శరీరానికి అందడం లేదని లెక్క. ఎందుకంటే ఎక్కువగా తీసుకునే విటమిన్ -ఏ పెద్ద మొత్తంలో కాలేయంలో నిల్వ అవుతూ.. అవసరమైనప్పడు విడుదలవుతూ ఉంటుంది. లోపం ఏర్పడేనాటికి కాలేయంలోనూ విటమిన్ -ఏ నిల్వ శూన్యమవుతుంది. ఇక కంటి చూపు దెబ్బతిన్నప్పుడు ‘రాడ్ స్కోటోమెట్రీ, ఎలక్ట్రోరెటీనోగ్రఫీ’ పరీక్షల ద్వారా అది విటమిన్ ఏ లోపం కారణంగానా? లేక మరేదైనా కారణంగానా? అనేది గుర్తిస్తారు.
 
లోపిస్తే ఎన్నో సమస్యలు
విటమిన్ -ఏ లోపం చాలా వరకు పోషకాహార లోపం కారణంగానే ఏర్పడుతుంది. ముఖ్యంగా బియ్యాన్ని వినియోగించే అన్నం, రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకునే ప్రాంతాల్లో ఈ లోపం ఎక్కువ. దీంతోపాటు కొవ్వులు వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడంలో లోపం, కాలేయ సంబంధిత వ్యాధులతోనూ విటమిన్ -ఏ లోపం ఏర్పడుతుంది.

కంటిలోని రెటీనాలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఏర్పడడానికి రెటినాల్ అత్యవసరం. ఇది లోపిస్తే దృష్టి మందగిస్తుంది. రేచీకటి వస్తుంది. కన్నీరు ఉత్పత్తి కాకపోవడంతో పొడి కళ్ల సమస్య వస్తుంది. రంగులను గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. చివరికి పూర్తిగా కళ్లు కనబడని పరిస్థితి కూడా రావొచ్చు.
 
ఇక దీని లోపం కారణంగా చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి గరుకుగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యలపైనా ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే మ్యూకస్ పొర దెబ్బతిని.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ -ఏ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే దీని మోతాదు మించితే ఏర్పడే దుష్పరిణామాలు చాలా ప్రమాదకరం. దీర్ఘకాలం పాటు ఎక్కువ మోతాదులో విటమిన్ -ఏ ను తీసుకుంటే.. కాలేయం దెబ్బతింటుంది. చర్మం, నరాల సంబంధిత సమస్యలు, వెంట్రుకలు రాలిపోవడంతో పాటు ఎముకలు గుల్లబారిపోవడం వంటివి తలెత్తుతాయి.
 
పిల్లలకు అత్యవసరం
ముఖ్యంగా చిన్న పిల్లల్లో విటమిన్ -ఏ అవసరం చాలా ఎక్కువ. దీని లోపం వల్ల వారిలో ఎదుగుదల మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ -ఏ లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే కార్నియా మెత్తగా మారి పగిలిపోతుంది. దాని కారణంగా శాశ్వత అంధత్వం వస్తుంది. కంటిలో పువ్వు (తెల్లని చుక్కలు) ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్నారులు పలు రకాల ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనవుతారు. ఇతరత్రా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే విటమిన్ -ఏ లోపం వల్ల అవి మరింతగా పెరిగిపోతాయి. మీజిల్స్ (తట్టు) సంక్రమించిన పిల్లల్లో వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విటమిన్ -ఏ బాగా తోడ్పడుతుంది.
 
ఇవి తింటే చాలు
విటమిన్ -ఏలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జంతు సంబంధ పదార్థాల్లో ఉండే రెటినాల్. రెండోది వృక్ష సంబంధమైన వాటిలో ఉండే బీటా కెరోటిన్. ఈ బీటా కెరోటిన్ మన కాలేయం, పేగుల్లో రెటినాల్ గా మారుతుంది.
 
- రెటినాల్ ఎక్కువగా లభించే ఆహారం పాలు, గుడ్లు, మాంసం, వెన్న, కాలేయం, చేపనూనె, కిడ్నీలు.
 
- బీటా కెరోటిన్ ఎక్కువగా ముదురు రంగులో, ఎక్కువ ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. ఇంకా ఆకు కూరలు, ఆరెంజ్, క్యారెట్లు, చిలగడ దుంప, గుమ్మడి, బ్రాకొలి, ఆప్రికాట్, తృణధాన్యాలు వంటి వాటిలో విటమిన్ -ఎ ఎక్కువగా ఉంటుంది.
 
"విటమిన్ -డి - ఎముకల దృఢత్వం కోసం"..
 
దృఢమైన ఎముకలు, బలమైన కండరాలు, మంచి రోగ నిరోధక శక్తికి విటమిన్ -డి అత్యవసరం. దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ఫాస్పేట్లు పేగుల నుంచి రక్తంలో కలిసేందుకు ఇది తోడ్పడుతుంది. ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మితిమీరిన కణ విభజనను నియంత్రించి కేన్సర్ వచ్చే పరిస్థితిని నివారిస్తుంది. కండరాలు, నాడులు సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
 
మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఎంతో కొంత విటమిన్ -డి లోపం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సూర్యరశ్మి తగలకపోవడం, విటమిన్‌ -డి లేని ఆహారం తీసుకోవడం, పారా థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతినటం, లివర్‌ వ్యాధులు, కిడ్నీ జబ్బుల వంటి సందర్భాల్లో విటమిన్‌-డి లోపం తలెత్తుతుంది.
 
ఊబకాయుల శరీరంలో విటమిన్ -డి కొవ్వులోనే నిక్షిప్తమై ఉంటుంది. దాంతో వారిలో దీని లోపం కనిపిస్తుంది. 50 ఏళ్లలోపు వారికి రోజుకు 200 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్లు), 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారికి రోజుకు 400 ఐయూ, 70 ఏళ్లు పైబడిన వారికి 600 ఐయూ విటమిన్ -డి అవసరం.

ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన మహిళలకు విటమిన్ -డి అవసరం చాలా ఎక్కువ. మరోవైపు ఆహారం ద్వారా అందిన, సూర్యరశ్మితో చర్మం తయారు చేసిన విటమిన్ డి మొత్తాన్నీ శరీరం యథావిధిగా వినియోగించుకోలేదు. అందులో కొంత వృధాగా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 700 నుంచి 1,000 ఐయూ వరకూ విటమిన్ -డి అందేలా చూసుకోవాలి. 
 
ఇక ఈ విటమిన్ లో మరిన్ని ఉప రకాలు ఉన్నా.. -డీ2, -డీ3లు మనకు అవసరం. బ్రెస్ట్, ప్రొస్టేట్ కేన్సర్లను, ల్యూకేమియా (రక్త కేన్సర్)ను నిరోధించడంలో విటమిన్ డి కీలకంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో ప్రాథమికంగా గుర్తించారు. కానీ పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు.
 
లోపిస్తే జీవితాంతం కష్టాలే..
మనం నిత్యం పనిచేసుకోవడానికి, కనీసం నిలబడడానికి ఎముకలు దృఢంగా ఉండడం అవసరం. విటమిన్ డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందక గుల్లబారిపోతాయి. దానివల్ల చిన్నపాటి ఒత్తిడికి గురయినా విరిగిపోతాయి. చిన్న పిల్లల్లో దొడ్డి కాళ్లు, ఛాతీ ఎముకలు ముందుకు వచ్చి పంజరంలా మారిపోయే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. 20 నుంచి 40 ఏళ్ల వయసువారిలో ఆస్టియో మలేసియా, నాడుల బలహీనత ఏర్పడుతుంది.
 
పెద్ద వయసు వారు, వృద్ధుల్లో ఆస్టియో ఫ్లోరోసిస్, ఆస్టియో పీనియా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక విటమిన్ -డి లోపం వల్ల ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్త రక్త కణాల్లో చురుకుదనం తగ్గిపోయి రకరకాల వ్యాధులు, రుగ్మతలు వెంటాడుతాయి.
 
చిన్న పిల్లల్లో టైప్-1 మధుమేహం రావడానికి విటమిన్ -డి లోపం కూడా కారణమని పరిశోధకులు గుర్తించారు. అంతేగాకుండా పలు రకాల కేన్సర్లు ముప్పు కూడా పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేల్చారు.
 
ఏ వయసు వారిలోనైనా కండరాల్లో నొప్పులు, కండరాలు బలహీనం కావడం, కీళ్ల నొప్పులు విటమిన్ -డి లోపానికి ప్రథమ సూచికలు. అలాగే తాజా పరిశోధనల్లో, విటమిన్ -డి లోపం వల్ల డిప్రెషన్ (కుంగుబాటు) అనే మానసిక వ్యాధికి కూడా గురవుతున్నట్టు వెల్లడైంది.* ఆల్కలీన్ ఫాస్పటేజ్, పారాథార్మోన్, 25హైడ్రాక్సి కోలీ కాల్సిఫెరాల్ పరీక్షల ద్వారా విటమిన్ -డి లోపాన్ని గుర్తించవచ్చు. ఎముకలు బలహీనం కావడాన్ని ఎక్స్ రేల ద్వారా గమనించవచ్చు.*
 
వృద్ధులూ! జాగ్రత్త
పెద్ద వయసు వారిలో చర్మం ముడతలు పడి, గరుకుగా మారిపోయి ఉండడంతో.. వారిలో విటమిన్ -డి తక్కువగా తయారవుతుంది. దానితోపాటు వయసుతో వచ్చే ఎముకలు గుల్లబారిపోవడం, కీళ్ల అరుగుదల వంటి సమస్యలూ ఎక్కువ. అందువల్ల 50 ఏళ్ల వయసుపైబడిన వారిలో విటమిన్ -డి అవసరం చాలా ఎక్కువ.
 
అంతేకాదు వారు విటమిన్ డి తోపాటు ఆహారంలో కాల్షియం, ఫాస్పరాస్ లు సరిపోయే మోతాదులో ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగిపోయి, వెన్నుపూస దెబ్బతిని జీవితం చివరి దశలో ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది.
 
కాస్త ఎండలో గడపండి
విటమిన్ -డి దొరికే ఆహార పదార్థాలు అతి స్వల్పం. దీనిని పొందడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఎండలో నిలబడడమే. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మన చర్మం విటమిన్ -డిని తయారుచేసుకుంటుంది. తెల్లగా ఉన్నవారికంటే కాస్త నలుపు చర్మం ఉన్నవారు ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే నలుపు రంగులో ఉన్న చర్మంలో మెలనిన్ సమర్థవంతంగా విటమిన్ డిని తయారుచేయలేదని పరిశోధనల్లో తేలింది.

కాడ్ చేప నూనె, సాల్మన్ చేపలు, రొయ్యలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, పోషకాలు కలిపిన తృణధాన్యాల్లో కొంత వరకు విటమిన్ -డి లభిస్తుంది. ఇక విటమిన్ డి లోపాన్ని గుర్తించిన పక్షంలో కేవలం ఎండలో నిలబడడం, ఆహారం ద్వారా వెంటనే అందే అవకాశం తక్కువ. అందువల్ల వైద్యుల సలహా మేరకు విటమిన్ -డి మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.
 
మోతాదు మించొద్దు'
విటమిన్ -డి ని అధిక మోతాదులో తీసుకుంటే చాలా దుష్పరిమాణాలు తలెత్తుతాయి. బరువు తగ్గిపోవడం, నీరసం, అతిగా మూత్రం రావడం, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్త నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. శరీరంలో కాల్షియం మోతాదు ఎక్కువైపోయి అది విషపూరితంగా (టాక్సిసిటీ) మారుతుంది. ముఖ్యంగా గర్భిణులు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ -డి మోతాదు మించితే గర్భంలోని శిశువుకు హాని కలుగుతుంది.

అయితే సాధారణంగా ఎండలో నిలబడడం ద్వారాగానీ, ఆహారం నుంచి గానీ అత్యధిక స్థాయిలో విటమిన్ -డి లభించే అవకాశం లేదు. కేవలం విటమిన్ -డి మాత్రలు, ఇతర సప్లిమెంట్లలో భాగంగా అందినప్పుడే మోతాదు మించుతుంది. అందువల్ల వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే విటమిన్ -డి సప్లిమెంట్లను వినియోగించడం శ్రేయస్కరం.
 
అందానికి, ఆరోగ్యానికి.. విటమిన్ -ఇ
మన అందానికి, ఆరోగ్యానికి, సంతానం పొందడానికి అత్యంత ముఖ్యమైనది విటమిన్ -ఇ. దీనిని రసాయనికంగా ‘టోకోఫెరాల్’ అని పిలుస్తారు. దీనివల్ల శరీర పటుత్వం పెరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి అవయవాలను రక్షించడంతోపాటు గర్భస్రావం కాకుండా నిరోధిస్తుంది.
 
పురుషుల్లో శుక్రకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. దీనికి కొవ్వును కరిగించే శక్తి ఉంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరంలోని ఫ్రీర్యాడికల్స్ ను, కేన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడేందుకు, రక్త కణాల వృద్దికి తోడ్పడుతుంది. 
 
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. రుతుక్రమం సమయంలోనూ మహిళలు ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గిస్తుంది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు విటమిన్ -ఇ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. 14 ఏళ్లు పైబడినవారికి రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం. అదే పిల్లలకు పాలిస్తున్న మహిళలు 19 మిల్లీగ్రాములు తీసుకోవాలి. అయితే విటమిన్ -ఇ అధికంగా తీసుకుంటే పలు దుష్పరిణామాలు తలెత్తుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు 1,000 మిల్లీగ్రాములకు మించి దీనిని తీసుకోకూడదు.
 
లోపిస్తే సంతాన సమస్య
విటమిన్ -ఇ లోపానికి గురికావడమనేది చాలా తక్కువ. ఇది మనం నిత్యం వినియోగించే చాలా రకాల ఆహారపదార్థాల్లో లభించడమే దీనికి కారణం. అయితే కొన్నేళ్లుగా మారిన జీవన విధానం కారణంగా శరీరానికి విటమిన్ -ఇ అందకుండా పోతోంది. నూనెలను ఎక్కువగా వేడి చేయడంతో వాటిల్లోని విటమిన్ నశిస్తుంది. ఇక ఎక్కువగా వేపుళ్లు, జంక్ ఫుడ్ కు అలవాటు పడడం వంటివాటితో శరీరానికి అవసరమైన విటమిన్ -ఇ అందడం లేదు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విటమిన్ -ఇ ఎంతో అవసరం.
 
దీని లోపం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు సులువుగా ఇన్ఫెక్షన్లకు లోనవుతాయి. అండ వాహికలు మూసుకుపోతాయి. పురుషుల్లో వీర్యకణాల్లో చురుకుదనం లోపిస్తుంది. దీంతో సంతాన లేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఇక విటమిన్ -ఇ లోపం వల్ల చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. రక్త హీనత, కండరాల బలహీనత, నీరసం, నరాల బలహీనత, మతి మరుపు, దృష్టి మందగించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడం, నాడులు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉండి రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు విటమిన్ -ఇ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు విటమిన్ -ఇ లోపం గనుక ఉంటే కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.
 
అజీర్ణం సమస్య ఉంటే మరింత జాగ్రత్త
తిన్న ఆహారం సరిగా జీర్ణం కాని సమస్యతో బాధపడుతున్నవారిలో కచ్చితంగా విటమిన్ -ఇ లోపం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గ్యాస్, దీర్ఘ కాలిక మలబద్ధకంతో బాధపడుతున్నవారు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు తీసుకున్నవారిలో కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే అవకాశం తక్కువ. దీంతో విటమిన్ -ఇ లోపం ఏర్పడుతుంది. 30 ఏళ్లుపైబడిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
 
మీ పిల్లలను గమనించండి
మూడు నుంచి ఆరు నెలలోపు శిశువుల్లో కొంత మందికి విటమిన్ -ఇ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఆ శిశువులకు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. ఈ స్థితిని 'అబెటలిపొప్రొటీనిమియా’ అంటారు. 
 
విటమిన్ -ఇ కొవ్వు పదార్థాలలో మాత్రమే కరుగుతుంది. దాని ద్వారానే శరీరానికి అందుతుంది. కొవ్వు పదార్థాలు జీర్ణం కానప్పుడు వాటిల్లో ఉండే విటమిన్ -ఇ కూడా అందక లోపం ఏర్పడుతుంది. శిశువుల్లో చర్మం పొడిబారిపోతుండడం, తరచూ అనారోగ్యానికి గురవుతుండడం ద్వారా దీనిని గుర్తించవచ్చు.

అలాంటి వారికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో విటమిన్ -ఇ తోపాటు తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది. వీటిల్లో విటమిన్ -ఇ మనం తరచూ తీసుకునే ఆహార పదార్థాల నుంచే విటమిన్ -ఇని పొందవచ్చు. 
 
ముఖ్యంగా గోధుమ మొలకల్లో (వీట్ జర్మ్) ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక బాదం, వాల్ నట్స్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, ఆలివ్ నూనెలు, మొక్కజొన్న, ఆకుకూరలు, తృణధాన్యాలు, చిలగడ దుంప, గుడ్లు, కాలేయంలలో లభిస్తుంది.
 
గాయాలు మాన్పే.. విటమిన్ కె
మనకు ఏదైనా గాయమైతే కొద్ది సేపటికే అక్కడ రక్తం గడ్డ కట్టి కారిపోవడం ఆగిపోతుంది. ఒకవేళ గడ్డకట్టకపోతే గాయం నుంచి రక్తం ధారాపాతంగా కారిపోయి.. తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
 
మరి ఇలా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకం విటమిన్ -కె. అందుకే దీనిని ‘బ్లడ్ క్లాటింగ్ విటమిన్’ అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి.
 
విటమిన్ -కె1 ( ఫిలోక్వినోన్ ), విటమిన్ -కె2 (మెనాక్వినోన్). ఎముకలు దృఢంగా ఉండడానికి విటమిన్ డి తోపాటు విటమిన్ -కె కూడా అవసరం. కణజాలాల్లో అంతర్గత క్రియలకు కూడా ఇది తోడ్పడుతుంది. -ఎ, -డి విటమిన్ల తరహాలోనే ఇది కూడా కొవ్వుల ద్వారా అందే విటమిన్.
 
సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ -కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. పెద్ద వయసు వారికి రోజుకు 70 నుంచి 90 మైక్రోగ్రాముల వరకు విటమిన్ -కె అవసరం. అయితే ఆయా వ్యక్తుల వయసు, బరువు, ఇతర కారణాలను బట్టి ఈ మోతాదు మారుతుంది. అమెరికా నేషనల్ హెల్త్ లైబ్రరీ, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ల లెక్కల ప్రకారం వ్యక్తుల శరీర బరువు ఒక్కో కిలోకు ఒక మైక్రోగ్రాము చొప్పున విటమిన్ -కె అవసరం.

ఉదాహరణకు 72 కిలోల బరువున్న వ్యక్తికి 72 మైక్రోగ్రాముల విటమిన్ -కె అవసరం. సాధారణంగా అధికంగా తీసుకున్న విటమిన్ కె శరీరంలో నిల్వ అవుతుంది. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదాలేమీ లేవు. కానీ గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు విటమిన్ కె విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 
లోపిస్తే ప్రమాదకరం
సాధారణ వ్యక్తుల్లో విటమిన్ -కె లోపం చాలావరకు తక్కువ. కానీ మారుతున్న ఆహార అలవాట్లు, జీవన విధానం దీని లోపానికి కారణమవుతోంది. దీనిని ‘విటమిన్ -కె అంటగోనిజమ్’గా పిలుస్తారు. మన పేగుల్లో విటమిన్ -కె ను తయారుచేసే బ్యాక్టీరియా తగ్గిపోవడం, అధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోలేని రుగ్మతలు (ఫ్యాట్ మాల్ అబ్జార్ ప్షన్), సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలేయ సమస్యలు విటమిన్ -కె లోపానికి కారణమవుతాయి.
 
ఇక గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులున్నవారు రక్తాన్ని పలుచన చేసేందుకు ఉపయోగించే కొన్ని రకాల మందులు విటమిన్ -కె పనితీరును దెబ్బతీస్తాయి. విటమిన్ కె లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టదు. దాంతో నిరంతరంగా రక్తస్రావం జరుగుతుంది.

అంతేకాదు శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ ఉండే పొర (మ్యూకోస్)ల్లో రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు ప్రబలి మరణించే అవకాశాలు పెరుగుతాయి. గాయాల నుంచి సాధారణం కంటే అధికంగా రక్త స్రావం జరుగుతూ ఉంటే విటమిన్ -కె లోపం ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
 
ఇక విటమిన్ -కె ఉత్ప్రేరకంగా రక్తంలోకి విడుదలయ్యే ప్రొత్రాంబిన్ వంటి ప్రొటీన్ల స్థాయిలను పరిశీలించడం ద్వారా, సీరంలో విటమిన్ల స్థాయి పరీక్ష ద్వారా కూడా గుర్తించవచ్చు.
 
శిశువులకు చాలా అవసరం
అప్పుడే పుట్టిన శిశువులకు విటమిన్ కె అత్యవసరం. ఎందుకంటే తల్లి కడుపులో ఉండగా.. శిశువులకు విటమిన్ కె అందదు. తల్లి నుంచి బిడ్డకు అనుసంధానంగా ఉండే మాయ (ప్లెసెంటా) కొవ్వు పదార్థాలను, అందులో కరిగి ఉండే విటమిన్ -కె ను రవాణా చేయనివ్వదు. దాంతో విటమిన్ కె నిల్వలేమీ లేకుండానే శిశువులు జన్మిస్తారు. దీంతోపాటు పుట్టిన కొద్ది రోజుల దాకా శిశువుల పేగుల్లో ‘సహ జీవన’ బ్యాక్టీరియా వృద్ధి చెందదు.

తల్లి పాలలో కూడా విటమిన్ -కె చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మొత్తంగా శిశువులకు విటమిన్ -కె అందని కారణంగా వారు పుట్టిన మొదటి రోజు నుంచి ఏడెనిమిది రోజుల లోపు రక్తస్రావ సమస్య ‘హెమరియేజిక్ డిసీజ్ (విటమిన్ కె డిఫిషియెన్సీ బ్లీడింగ్ - వీకేడీబీ)’ తలెత్తే అవకాశముంది.
 
దీంతోపాటు కేవలం తల్లిపాలు పట్టడం, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలు ఉన్న చిన్నారుల్లో రెండు నెలల వయసు వరకూ కూడా ఈ జబ్బు వస్తుంది. పలు సందర్భాల్లో పరిస్థితి విషమించి శిశువులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అందువల్ల శిశువులకు పుట్టిన వెంటనే విటమిన్ -కె ను నోటి ద్వారా చుక్కల రూపంలో అందజేస్తారు. శిశువులకు విటమిన్ -కె లోపం ఉండే అవకాశమున్నందు వల్లే సాధారణంగా శిశువులకు ఇచ్చే మందులు, ఫార్ములాల్లో విటమిన్ -కె కూడా ఒక సప్లిమెంట్ గా ఉంటుంది.
 
గుండె, రక్తనాళాల సమస్యలున్నవారు వేసుకోవద్దు
గుండె, రక్తనాళాల సమస్యలతో బాధ పడుతూ రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, ఊబకాయులు, మధుమేహం ఉన్నవారు విటమిన్ -కె విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
 
విటమిన్ -కె మాత్రలు, విటమిన్ కె అదనపు సప్లిమెంట్ గా ఉన్న మాత్రలకు దూరంగా ఉండాలి. ఇది ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇలాంటి వారికి విటమిన్ -కె మోతాదు ఎక్కువగా అందితే అది రక్తం గడ్డకట్టడానికి దారితీసి.. గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శరీరంలో ఇతర భాగాల్లోనూ రక్తనాళాలు దెబ్బతినవచ్చు కూడా. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సలహా తీసుకుని, వారు సూచించిన మోతాదుల్లో మాత్రమే విటమిన్ కె ను తీసుకోవాలి.
 
తయారయ్యేది మన కడుపులోనే
సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ -కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే కోలోనిక్ బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. ఇక బచ్చలి వంటి ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రాకొలీ, అవగాడో, ద్రాక్ష, సోయాబీన్, ఆలివ్ నూనె, మాంసం, పాలు, గుడ్లు, చేపలు, కాలేయం, తృణ ధాన్యాల్లో లభిస్తుంది.
 
పరిమితికి మించి వాడొద్దు
ఒక వేళ విటమిన్ -కె మోతాదు ఎక్కువైతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్ట తగ్గిపోవడం, నీరసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, శరీరంలో అక్కడక్కడా వాపు, నొప్పులు, కండరాలు పట్టేసినట్టుగా ఉండడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడంతో పాటు అరుదుగా మింగడంలో సమస్యలు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, రక్తపోటు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ -కె ను వాడడం శ్రేయస్కరం.
 
విటమిన్ -సి.. గుండెకు రక్ష
మన శరీరంలో కణాల పెరుగుదల, పునరుద్ధరణకు విటమిన్ -సి అత్యవసరం. గుండెకు, రక్త కణాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ -సి రసాయనిక నామం ఆస్కార్బిక్ యాసిడ్ ( Ascorbic Acid ).
 
సాధారణంగా చెప్పాలంటే మనకు తరచూ వచ్చే రుగ్మత అయిన జలుబుకు కూడా విటమిన్ -సి మంచి నిరోధకారి. శరీరంలో వివిధ కణజాలాలను పట్టి ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి విటమిన్ -సి కీలకం. చర్మ కణాలు, రక్త నాళాలతో పాటు కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం కల్పించే టెండాన్ లు, లిగమెంట్లు తయారు కావడానికి, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది అవసరం.

ఎర్ర రక్త కణాల తయారీకి అవసరమైన ఐరన్ ను ఆహారం నుంచి శరీరం సంగ్రహించడానికి విటమిన్ -సి తోడ్పడుతుంది. ఇక అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం... కార్టిలేజ్ (మృదులాస్థి), ఎముకలు, దంతాలు దెబ్బతిన్నప్పుడు వాటిని పునరుద్ధరించడానికి, గాయాలు మానిపోవడానికి శరీరం విటమిన్ -సి ని వినియోగించుకుంటుంది. 
 
కాలుష్యం, పొగతాగడం, అల్ట్రా వయోలెట్ (యూవీ) కిరణాల ప్రభావంతో శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడడం కారణంగా వచ్చే సమస్యలను నియంత్రించి కేన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరపు, దృష్టిలోపం వంటి సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

ముఖ్యంగా విటమిన్ -ఇ, బీటా కెరోటిన్ (విటమిన్ -ఏ), జింక్ సప్లిమెంట్లతో కలిపి రోజుకు 500 మిల్లీగ్రాముల విటమిన్ -సి తీసుకుంటే.. వారిలో వృద్ధాప్యంలో కండరాలు కుచించుకుపోవడాన్ని 25 శాతం వరకు, దృష్టి సమస్యలు ఏర్పడడాన్ని 19 శాతం తగ్గిస్తుందని అమెరికన్ నేషనల్ ఐ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఇక ఎల్ డీ ఎల్ (బ్యాడ్) కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా రక్తనాళాలు గట్టిపడకుండా విటమిన్ -సి సహాయపడుతుందని... తద్వారా గుండెపోటు వచ్చే ముప్పును తగ్గిస్తుందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఆయా వ్యక్తుల వయస్సు, స్త్రీ పురుషులు, ఇతర అంశాల ఆధారంగా రోజువారీ విటమిన్ -సి అవసరాల్లో మార్పులు ఉంటాయి. సాధారణంగా మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాములు, పురుషులకు 90 మిల్లీగ్రాములు విటమిన్ -సి అవసరం. అదే గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులకు 80 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు అవసరం.
 
లోపిస్తే గాయాలు మానవు
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే అలవాటు లేనివారిలో విటమిన్ -సి లోపం కనిపిస్తుంది. అయితే విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరంలో నిల్వ ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు విటమిన్ -సి ఉండే ఆహారం తీసుకోవాల్సిందే. ఒకసారి ఎక్కువగా తీసుకున్నా కూడా మూత్ర పిండాల్లో వడపోతకు గురై మూత్రం ద్వారా బయటకు వెళ్లపోతుంది. అందువల్ల విటమిన్ -సి లోపం చాలా మందిలో కనిపిస్తుంటుంది. 
 
ముఖ్యంగా సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారికి విటమిన్ -సి హెచ్చు మోతాదులో కావాల్సి ఉంటుంది. ఇక తీవ్ర జ్వరం, డయేరియా వంటి వాటి బారినపడినప్పుడు, ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారికి, చర్మంపై కాలిన గాయాలైన వారికి కూడా విటమిన్ -సి అవసరం ఎక్కువ.
 
విటమిన్ -సి లోపం వల్ల సాధారణంగా పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మం ఎండిపోయి పొలుసుల్లా ఏర్పడడం, వెంట్రుకలు పొడిబారిపోయి రాలిపోవడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనుకావడం, గాయాలు మానడానికి ఎక్కువ కాలం పట్టడం, నీరసం, బలహీనత వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదే ఈ లోపం దీర్ఘకాలం పాటు ఉంటే స్కర్వీ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. రక్తహీనత కూడా రావచ్చు. విటమిన్ -సి లోపాన్ని రక్తంలో విటమిన్ -సి స్థాయులను పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చు.
పిల్లలు, వృద్ధులకు బాగా అవసరం.
 
సాధారణంగా శిశువులకు విటమిన్ -సి లోపం ఉండే అవకాశం తక్కువ. తల్లిపాల ద్వారా తగిన మోతాదులో అందుతుంది. కానీ తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత చిన్నారుల్లో విటమిన్ -సి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో స్కర్వీ అనే వ్యాధి బారిన పడవచ్చు. విటమిన్ -సి లోపం ఉన్న పిల్లలు నడిచేటపుడు కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి.
 
సరైన స్థాయిలో బరువు పెరగరు. ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. రక్తస్రావం, రక్త హీనత తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసు వారిలో కండరాలు కుచించుకుపోవడం, కీళ్ల నొప్పులు, బరువు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వృద్ధాప్యం లక్షణాలు వేగంగా ముసురుకుంటాయి.
 
పుల్లటి పదార్థాలేవైనా
సహజ సిద్ధంగానే విటమిన్ -సి లభించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పుల్లగా ఉండే పండ్లు, కూరగాయల్లో ఇది విస్తృతంగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, మామిడి, బొప్పాయి, జామ, ఫైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, ఆకుకూరలు, మిరపకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, బంగాళదుంప, బ్రాకొలీ, మొలకెత్తిన పప్పు ధాన్యాలు వంటివి విటమిన్ -సి కి మంచి వనరులు. అయితే విటమిన్ -సి అస్థిర పదార్థం.

ఇది ఒక స్థాయికి మించి వేడిచేస్తే నశించిపోతుంది. అందువల్ల కూరగాయలనుగానీ, విటమిన్ -సి ఉండే ఆహార పదార్థాలు వేటినిగానీ ఎక్కువగా ఉడికించకూడదు. వేపుళ్లు వంటివి చేస్తే విటమిన్ -సి అసలు లభించదు.
 
ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు
విటమిన్ సి ని మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజులో 2 గ్రాములకు మించి తీసుకుంటే.. గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, డయేరియా వంటివి వచ్చే ప్రమాదం ఉంది. మరికొందరిలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు తలెత్తుతాయి.
 
ఇష్టం వచ్చినట్లుగా వాడితే ప్రమాదం
విటమిన్లు శరీరానికి ఎంతో అవసరమై