శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2016 (13:45 IST)

మెదళ్ళలో చిప్‌లు అమర్చి మా మనసులు నియంత్రిస్తున్నారు.. బెంగుళూరు టెక్కీలకు 'పారనోయా' రుగ్మత

సైన్స్ ఫిక్షన్ కథలలో చెప్పుకున్న 'పారనోయా' (భయం లేదా ఆందోళన వల్ల కలిగే మానసిక మార్పు) బెంగళూరు ఐటీ కంపెనీలను తాకింది. తమ మనసులను యూఎస్ నుంచి నియంత్రిస్తున్నారని, తమిళనాడు పోలీసులు తమను కంట్రోల్ చేస్తు

సైన్స్ ఫిక్షన్ కథలలో చెప్పుకున్న 'పారనోయా' (భయం లేదా ఆందోళన వల్ల కలిగే మానసిక మార్పు) బెంగళూరు ఐటీ కంపెనీలను తాకింది. తమ మనసులను యూఎస్ నుంచి నియంత్రిస్తున్నారని, తమిళనాడు పోలీసులు తమను కంట్రోల్ చేస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు టెక్కీల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌కు సైబర్ రాజధానిగా పేరున్న బెంగళూరును ఇప్పుడు భయపెడుతున్నది ఈ పారనోయానే. ఈ మానసిక రుగ్మత వివరాలను పరిశీలిస్తే... 
 
కొన్ని వారాల క్రితం శ్రీరేఖ (పేరు మార్పు) అనే ఐటీ ఉద్యోగిని మానవ హక్కుల సంఘానికి వచ్చి యూఎస్ ఫెడరల్ పోలీసులు తన మెదడును నియంత్రిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. "మొదటిసారి ఆమె మా దగ్గరకు వచ్చినప్పుడు, తన మాజీ భర్త యూఎస్‍‌లో ఉన్నాడని తెలిపింది. ఫెడరల్ పోలీసులు తన ఆలోచనలను నియంత్రిస్తున్నారని తెలిపింది. మేము ఆమెకు ఏవైనా ఆస్తి వివాదాలు, చిన్నారుల కస్టడీ వివాదాలు ఉన్నాయా? అని విచారించాం. అవేమీ లేవని తేలింది. తనను మరో ప్రాంతం నుంచి ఎవరో కంట్రోల్ చేస్తున్నారన్నది ఆమె భయం. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి" అని కర్ణాటక మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ మీరా సక్సేనా వెల్లడించారు. 
 
మరో కేసులో భారత సూపర్ కాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేపీఎస్ గిల్, తన మెదడులో ఓ చిప్‌ను అమర్చి తనను నియంత్రిస్తున్నట్టు పీ రాకేష్ (పేరు మార్చాం) అనే యువకుడు ఫిర్యాదు చేశారు. తన బ్రెయిన్‌ను ఆయన చాలా రోజులుగా కంట్రోల్ చేస్తున్నాడన్నది ఆయన ఆరోపణ. ఇక మరో కేసులో ఇంకో మహిళ వచ్చి తమిళనాడు పోలీసులు తన మనసులోకి ప్రవేశించినట్టు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు తమ పరిధిని దాటి ఉండటంతో నిమ్హాస్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) సహాయాన్ని కోరామని సక్సేనా తెలిపారు. 
 
దీనిపై ప్రముఖ సైకియాట్రిస్ట్ జీకే కన్నన్ స్పందిస్తూ... "ఇది ఓ రుగ్మతగానే భావిస్తున్నాం. అయితే కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం కొన్ని విషయాలను మాత్రమే నిత్యమూ చర్చిస్తుండే వారిలో పారనోయా సమస్య పెరుగుతోంది. కుటుంబంలోని వారిలో మానసిక సమస్యలు ఉన్నా కూడా కొందరు ఇలా ప్రవర్తించవచ్చు" అని చెప్పుకొచ్చారు.