1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Shubhanshu Shukla's Space Mission Postponed Again, No New Date In Sight

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

Shubhanshu Shukla
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు సభ్యుల బృందాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ఆక్సియమ్ మిషన్-4 ప్రయోగానికి మరోమారు అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడిన ఈ ప్రయోగం ఏడోసారి కూడా వాయిదాపడింది. ముందుగా జూన్ 22వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టాలని భావించినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల మరమ్మతులు పనుల అనంతరం అక్కడి కార్యకలాపాలను నాసా నిశితంగా పరిశీలిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రయోగాన్ని చేపట్టాలన్న ఉద్దేశ్యంతో నాసా ఈ వాయిదా నిర్ణయం తీసుకుంది. 
 
ఈ వాయిదా విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అధికారికంగా ధ్రువీకరించింది. "నాసా, యాక్సియమ్ స్పేస్, స్పేస్ఎక్స్ సంస్థలు ఆక్సియమ్ మిషన్ 4 ప్రయోగానికి గల అవకాశాలను సమీక్షిస్తూనే ఉన్నాయి. జూన్ 22న జరగాల్సిన ప్రయోగాన్ని నాసా ప్రస్తుతానికి నిలిపివేసింది. రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగ తేదీని ప్రకటిస్తుంది" అని ఐఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
 
ప్రయోగం కోసం ఎంపికైన వ్యోమగాముల బృందం మే 14వ తేదీ నుంచి ఫ్లోరిడాలో ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంది. ప్రయోగానికి అవసరమైన అన్ని వైద్యపరమైన, భద్రతాపరమైన నిబంధనలను వీరు పాటిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి జూన్ 30 వరకు ప్రయోగానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ గడువులోగా ప్రయోగం సాధ్యపడకపోతే, జులై మధ్యలో మరోసారి ప్రయోగానికి అవకాశం లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
తర్వాతి కథనం
శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...