మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైమంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్‌గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతుంది.
* ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య సమయంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదు.
* ఉదయం 7 నుంచి 9 మధ్య ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని, పండ్లను ఈ సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయి.
* ఉదయం 9 నుంచి 11 మధ్య సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరరీంలో జరిగే జీవక్రియలను గాడిలో పెడుతుంది. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది.
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుంది. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చూస్తుంది. దీని వల్ల శరీర కణాలకు శక్తి అందుతుంది.
* మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో చిన్నపేగులు అలర్ట్‌గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణప్రక్రియను ముగిస్తుంటాయి.
* మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో మన మూత్రాశయం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి.
* సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల సమయంలో మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి.
* రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది.
* రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి.
* రాత్రి 11 నుంచి 1 గంట మధ్య సమయంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుంటుంది.
* రాత్రి 1 నుంచి ఉదయం 3 మధ్య సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటికి వెళ్లవు.
* ఉదయం 3 నుంచి 5 మధ్యలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి.