జన్యు ఆధారిత టీకాతో కరోనాకు చెక్ - తొలుత జంతువులపై ప్రయోగం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్రపంచ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా, కరోనాకు సరైన వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, అమెరికాకు చెందిన మాసాచ్యూసెట్స్ ఆస్పత్రి ఓ పరిశోధన చేస్తోంది. 'ఆవ్ కొవిడ్' పేరిట జరుగుతున్న ఈ ప్రయోగం ద్వారా జన్యు ఆధారిత టీకా తయారు చేస్తున్నట్టు తెలిపారు.
ఇందుకుసంబధించి ప్రస్తుతం జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించింది. త్వరలోనే మానవులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ టీకాకు సంబంధించిన ప్రయోగాలు, అభివృద్ధి వివరాలను ఇటీవల వెల్లడించింది. జన్యు మార్పిడి ఆధారిత ఈ టీకాలో అడినో-అసోసియేటెట్ వైరస్(ఏఏవీ)లు ఉంటాయి. ఇతర వ్యాధులకు కారణం కాకుండా మనుషులపై ప్రభావం చూపే వైరస్‌లనే ఏఏవీలు అంటారు.
కణాల్లోకి ఇతర జన్యు పదార్థాన్ని చొప్పించేందుకు శాస్త్రవేత్తలు 'వైరల్ వెక్టార్స్' అనే పరికరాలను ఉపయోగిస్తారు. ఈ పరిజ్ఞానంతో శరీరంలోకి కరోనా వైరస్ కొమ్ము(స్పైక్) ప్రతిజనకాన్ని (యాంటీజన్) పంపిణీ చేస్తారు. ఇది దేహంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక స్పందనను అభివృద్ధి చేస్తుంది.