బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By venu
Last Modified: బుధవారం, 29 మార్చి 2017 (19:00 IST)

మారథాన్‌లో పాల్గొంటున్నారా? అయితే అది ప్రమాదంలో ఉన్నట్లే...

ఈ రోజుల్లో మన నిరసనను వ్యక్తం చేసేందుకో, మన మద్దతు తెలియజేసేందుకో, కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకో.. కారణం ఏదైతేనేం - ఒక్కో నగరంలో కనీసం నెలకు ఒక్క మారథాన్ అయినా జరుగుతూనే ఉంది. రోడ్డుపై (కొందరి భాషలో, బాధలో రోడ్డుకు అడ్డంగా - ట్రాఫిక్

ఈ రోజుల్లో మన నిరసనను వ్యక్తం చేసేందుకో, మన మద్దతు తెలియజేసేందుకో, కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకో.. కారణం ఏదైతేనేం - ఒక్కో నగరంలో కనీసం నెలకు ఒక్క మారథాన్ అయినా జరుగుతూనే ఉంది. రోడ్డుపై (కొందరి భాషలో, బాధలో రోడ్డుకు అడ్డంగా - ట్రాఫిక్ కష్టాలు మరి) అధికారకంగా 42.195 కిలోమీటర్లు పరిగెత్తవలసిన ఈ మారథాన్ రేసులో యువకులతో సమానంగా, స్త్రీలు, కొద్దిగా వయస్సు మీరినవారు కూడా పాల్గొనడం ఇటీవల సాధారణమైపోయింది. 
 
కానీ ఇకపై మారథాన్‌లో పాల్గొనాలి అనుకునేవారు కొద్దిగా జాగ్రత్త వహించడం, ఆ విషయంపై మరోసారి పునరాలోచించుకోవడం తప్పనిసరి అంటున్నారు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంవారు. వారు ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో మారథాన్‌లో పాల్గొనేవారిలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయని వెల్లడైంది. అయితే ఇది స్వల్పకాలికమేనని కూడా తేల్చారు. 
 
ఈ అధ్యయనంలో భాగంగా మారథాన్‌లో పాల్గొనేవారి నుండి వారు మారథాన్ ప్రారంభించడానికి ముందు, ముగిసిన తర్వాత రెండు రక్తం, మూత్ర నమూనాలను తీసుకున్నారు. మారథాన్‌లో పాల్గొనడానికి ముందు లేని మూత్రపిండ గాయం, సీరం క్రియాటినైన్ స్థాయిలు, మూత్రంలో ప్రొటీన్లను గమనించారు. మారథాన్‌లో పాల్గొనేవారిలో 82% మంది అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ దశ 1లో ఉన్నారని తేలింది. ఈ దశలో మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థాన్ని వడపోత చేయలేవని పరిశోధకులు తెలియజేసారు. మారథాన్‌లో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి, శారీరక శ్రమ మూలంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం, డీహైడ్రేషన్ లేదా రక్త ప్రసరణ తగ్గడం వంటి వాటి మూలంగా ఈ మూత్రపిండ సమస్యలు కలగవచ్చని పరిశోధనలో వెల్లడైంది. 
 
అయితే మారథాన్ మూలంగా ఏర్పడే ఈ సమస్యలన్నీ మారథాన్ ముగిసిన రెండు రోజుల్లో నయం అయిపోతాయన్న పరిశోధకులు, అంతకుమించి ఎక్కువ కాలం ఈ ప్రభావం ఉన్న పక్షంలో వైద్యుని సంప్రదించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.