గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (12:05 IST)

ప్రపంచంలో 230 కోట్ల మంది చేతులు శుభ్రం చేసుకోవడం లేదట...

ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ (యునిసెఫ్) ఓ దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది చేతులను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని వెల్లడించింది. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లోని పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నట్టు తెలిపింది. 
 
ఇలాంటి దేశాల్లో ప్రతి పది మందిలో ఆరుగురికి చేతులను కడుక్కోవడానికి అవసరమైన సబ్బు, నీరు వంటివి అందుబాటులో లేవని వివరించింది. కరోనా వేళ ఈ సమస్య మరింతగా పెరిగినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌వాష్‌ డే' సందర్భంగా యునిసెఫ్‌ తాజా నివేదికను విడుదల చేసింది. 
 
ఈ నివేదికలో పేర్కొన్న అంశాల మేరకు.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 శాతం బడుల్లో చేతులు కడుక్కునేందుకు అవసరమైన సబ్బు, నీరు వంటి సదుపాయాల్లేవు. ఫలితంగా 81.80 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారు.
 
అంతగా అభివృద్ధి చెందని దేశాల్లోని 70 శాతం పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి చోటే లేదని తెలిపింది. ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి అవసరమైన సదుపాయాల్లేవు. 
 
ఇళ్లలో చేతులను శుభ్రం చేసుకునే సదుపాయం లేనివారు 67 శాతం నుంచి 71 శాతానికి పెరిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరినాటికి కూడా సుమారు 190 కోట్ల మందికి చేరుకోవచ్చని పేర్కొంది.