శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 21 మార్చి 2022 (23:40 IST)

ఆకు కూరల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఆకు కూరల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

 
గోంగూరలో పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవలన రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. తోటకూరను వారంలో కనీసం రెండు సార్లయినా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

 
కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, భాస్వరం చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచటమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వాంతులు, తలనొప్పి సమస్యలకు పుదీనా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన ఇది కంటిచూపు బాగా ఉండటానికి దోహదపడుతుంది.