గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (21:53 IST)

వేపతో ఆ ప్రయోజనాలు తెలిస్తే...

ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్ల వల్ల శరీరంలో రోజూ చాలా విషతుల్య పదార్థాలు చేరుతుంటాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి వేపను ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల శరీరంలోని విషతుల్య పదార్థాలు తొలగిపోతాయి. కాలేయాన్ని, కిడ్నీల పనితీరు మెరుగయ్యేలా వేప ఉపకరిస్తుంది. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది. వేపలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. వేపను తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు, మలబద్దకం, ఇన్ఫెక్షన్లు తగ్గించి ఆహార నాళ సంబంధ సమస్యలు రాకుండా చేయడంలో వేప ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల కారణంగా కడుపులోని మంచి బ్యాక్టీరియా నాశనం కాకుండా కాపాడుతుంది.
 
2. వేప వల్ల లభించే ప్రయోజనాల్లో ముఖ్యమైంది డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడం. వేపలోని రసాయనాలు శరీరానికి తగినంత ఇన్సులిన్ అందేలా చూస్తాయి. డయాబెటిస్ రోగులకు ఇదెంతో ఉపయోగకరం. డయాబెటిస్ వచ్చే అవకాశాలను వేప తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ మీద ఆధారపడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
 
3. వేప పువ్వులతో జ్యూస్‌లా చేసి తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చి కొవ్వు కరిగేలా చేస్తుంది. వేప పువ్వుల జ్యూస్‌ను నిమ్మ లేదా తేనెతో కలిపి తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు.
 
4. వేప ఉత్పత్తులను టూత్ పేస్టులు, మౌత్ వాష్‌లలో ఉపయోగిస్తున్నారు. వేపలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు అధికంగా ఉండటంతో.. అన్ని రకాల ఉత్పత్తుల్లో దాన్ని వాడుతున్నారు. చిగుళ్లలో దాగి ఉన్న బ్యాక్టీరియాను ఇది చంపేస్తుంది. నోరు దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.
 
5. గాయాలపై వేప పేస్టును రాయడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుకుండా జాగ్రత్త పడొచ్చు. వేపాకులను ముద్దగా చేసి గాయమైన చోట రాస్తే.. గాయాలు త్వరగా మానుతాయి.
 
6. చుండ్రు సమస్య తగ్గడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వేపాకు ఉపకరిస్తుంది. తలలో పేనులను వేప చంపేస్తుంది. వేప మాడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.