మండే ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి...
ఎండాకాలం వచ్చింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండాకాలం సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు. దీంతో పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, వేడిమికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాదపడుతున్నా వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు.
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెంకొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి. ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది. స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. వేసవిలో రెండు పూటల స్నానం చేయడం మంచిది.