శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (11:41 IST)

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి?

వేకువజామున నిద్రలేవడం చాలామందికి సుతరామా ఇష్టముండదు. నిజానికి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కానీ అలా నిద్ర లేవడం అంటే చాలా కష్టమైన పనిగా భావిస్తారు.
 
నిద్ర నుంచి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి సమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటాం కానీ, ఉదయం మాత్రం లేవలేం బాబూ అనేవారూ అనేక మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
 
* నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్‌, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
* ప్రతిరోజూ ఉదయాన్ని యాక్టీవ్‌గా ప్రారంభించాలంటే ముందుగా స్నానం చేయాలి. నిద్రలేవగానే స్నానం చేయడం వల్ల బద్ధకాన్ని దూరం చేయవచ్చు.
* నిద్ర మత్తు వదలాలంటే లేచిన వెంటనే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల నిద్రమత్తు వదిలి, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజమైన విటమిన్ డి కూడా అందుతుంది.
* రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పడుకునేందుకు గంట ముందు నిద్రపోకుండా ఉండటం ఉత్తమం. 
* కావాల్సినంత సేపు నిద్రపోకపోవడం వల్ల ఆ రోజంతా మూడీగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఓ నియమం ప్రకారం నిద్ర పోవాలి. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు.