శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (10:56 IST)

నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు - ముందస్తు సమరానికి కేసీఆర్ సై

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆదివారం రద్దయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆదివారం రద్దయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ సహచరులతో సమావేశం కానున్న కేసీఆర్, అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, ఆ వెంటనే గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆ తర్వాతే కొంగరకలాన్‌కు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకుంటారని తెలుస్తోంది. 
 
అదే జరిగితే, అసెంబ్లీని సమావేశపరచకుండానే, సభను రద్దు చేసినట్టు అవుతుంది. అప్పుడు మార్చిలో జరిగిన వేసవికాల సమావేశాలే ప్రస్తుత ప్రభుత్వానికి చివరి అసెంబ్లీ సమావేశాలుగా మారుతాయి. అసెంబ్లీ రద్దు విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఆదివారం ఈ నిర్ణయం వెలువడుతుందని తెరాస శ్రేణులు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ నేతలు, ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడేంత వరకూ సాధ్యమైనంత మౌనంగానే ఉండాలని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దయితే, కొంగరకలాన్‌లో జరిగే భారీ బహిరంగ సభ, ఎన్నికల బాటలో టీఆర్ఎస్ తొలి సభ అవుతుంది.
 
ఇదిలావుంటే, చరిత్రలో నిలిచేలా తెరాస పార్టీ ఆదివారం నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గంలోని మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలివస్తున్నారు. కుమరంభీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి ప్రగతినివేదన సభకు బయలుదేరే బస్సులను ఎస్పిఎం మైదానంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెండా ఊపి ప్రారంభించారు. 
 
ఆయా జిల్లాల నుంచి రైతులు తమ ట్రాక్టర్లతో ఒక రోజు ముందుగానే సభా స్థలికి తరలివెళ్లారు. సభకు తరలి వెళ్లేందుకు బస్సులతో పాటు ప్రైవేట్ జీపులు, ఇతర వాహనాలు ఏర్పాట్లు చేశారు. బస్సులు, జీపుల్లో ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకుండా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.