శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By సందీప్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:52 IST)

తెలంగాణాలో కంచి ఆలయం... కొడకంచి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పంటపొలాలు, పక్కనే కోనేరు కల్గి ఉండి అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు. కంచికి వెళ్లకున్నా కొడకంచికి మాత్రం వెళ్లాలనే నానుడి అనాదిగా వస్తోంది. 
 
స్వామి వారు 900 ఏళ్ల క్రితం శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొడకంచి గుట్టపై వెలిశాడని పెద్దలు చెబుతారు. ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేంటంటే 900 ఏళ్ల క్రితం అల్లాణి వంశస్తుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్‌ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాణి వంశస్తులతో పాటు, గ్రామ ప్రజలందరూ కలసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామి వారు అల్లాణి వారి కలలోకి వచ్చి తెల్లవారే లోపు మీ ఇంటిముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడపక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారు. 
 
గరుడపక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాణి వంశస్తులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్టించారు. అప్పటినుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడి స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. 
 
కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణంలో ఉన్న కొలనులో స్నానం చేసి, దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే కంచికి వెళ్లలేకున్నా కొడకంచికి వెళ్లాలనే నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు, వెండి బల్లులు ఉండటంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది. రానురాను కడకంచి కాస్తా కొడకంచిగా మారింది.