శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:23 IST)

కరోనా కాటుకు బలైన సుప్రసిద్ధ గాయకుడు

సుప్రసిద్ధ గాయకుడు మరియు పాటల రచయిత, ఆడమ్ ష్లెసింగర్ కరోనా వైరస్ కాటుకి బలయ్యారు. ఈయన ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ యొక్క సహ-వ్యవస్థాపకుడిగా ప్రసిద్ది చెందారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా ప్రాణం కోసం పోరాడినప్పటికీ దురదృష్టవశాత్తు కన్నుమూశారు.
 
అతను బాస్ ప్లేయర్, బ్యాకింగ్ సింగర్ మరియు ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ యొక్క సహ-గేయరచయితగా ప్రసిద్ది చెందాడు. కాగా ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ కూడా అతడి మరణం పట్ల తన బాధను పంచుకున్నారు.
 
మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, యూరప్ దేశాలు అయితే వణికిపోతున్నాయి. ఈ రెండు దేశాల్లో కరోనా మృతులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క అమెరికాలోనే గత 24 గంటల్లో ఏకంగా 884 మంది చనిపోయారు. అలాగే, యూరప్‌లో బుధవారం రాత్రికి మరణాల సంఖ్య ఏకంగా 30 వేలకు దాటింది. 
 
అలాగే, అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి 5,110 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,15,215కు చేరుకుంది. మార్చి 27న ఇటలీలో 969 మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,35,840 నమోదు అయ్యాయి. 47,241 మంది మృతి చెందారు. అత్యధికంగా ఇటలీలో 13,155 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇదిలావుంటే, కోవిడ్ 19తో యూరప్ వణికిపోతోంది. ఇక్కడ మొత్తం 4,58,601 కేసులు నమోదయ్యాయి. ఇందులో బుధవారం రాత్రి వరకు మృతి చెందిన వారి సంఖ్య 30 వేలు దాటిపోయింది. మొత్తంగా 30,063 మంది కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు స్పెయిన్ తమ దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్లను 20 శాతం పెంచడమే కాకుండా క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్‌ సెంటర్లను కూడా ఆసుపత్రులుగా మార్చేందుకు సిద్ధమైంది. హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. కరోనా రోగులకు సేవలు అందించేందుకు ముందుకు రావాల్సిందిగా వైద్య విద్యార్థులు, రిటైర్డ్ వైద్యులు, విమానాల్లోని మెడికల్ సిబ్బందిని ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు పిలుపునిచ్చాయి.